Uddhav Warning: ఇతరులను మీరు నాశనం చేయాలనుకుంటే..

ABN , First Publish Date - 2022-08-02T01:28:06+05:30 IST

ఇతరులను నాశనం చేయాలనుకుంటే అది ఎల్లకాలం చెల్లుబాటు కాదని, కాలం మారుతుందని, ఎల్లకాలం వారే పదవిలో ..

Uddhav Warning: ఇతరులను మీరు నాశనం చేయాలనుకుంటే..

ముంబై: ఇతరులను నాశనం చేయాలనుకుంటే అది ఎల్లకాలం చెల్లుబాటు కాదని, కాలం మారుతుందని, ఎల్లకాలం వారే పదవిలో ఉండరని శివసేన చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి సోమవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టుపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు, రౌత్ కుటుంబ సభ్యులను థాకరే పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సంజయ్ రౌత్‌ను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు. సంజయ్ రౌత్ తనకు మంచి మిత్రుడని, జర్నలిస్టు, శివసైనికుడని అన్నారు. చనిపోవాల్సివ వచ్చినా అందుకు సిద్ధమే కానీ, ఎవరికీ లొంగిపోయేది లేదని రౌత్ కరాఖండిగా చెప్పారని అన్నారు. ఇవాళ ఒత్తిడి రాజకీయాలే నడుస్తున్నాయని, భవిష్యత్తులో తమ విషయంలో ఏమి జరుగుతుందో బీజేపీ, నడ్డా (బీజేపీ అధ్యక్షుడు) ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. దేశాన్ని ఎవరు తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారో సామాన్య ప్రజానీకం గుర్తించే రోజు ఒకటుంటుందని అన్నారు.


విసుగుపుట్టిస్తున్న రాజకీయాలు...

ఇవాల్టి రాజకీయాలు విసుగుపుట్టిస్తున్నాయని థాకరే అన్నారు. దేశంలో ''హిట్లర్-శకం పరిస్థితి'' కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, అతన్ని అరెస్టు చేస్తున్నారని థాకరే ఆరోపించారు. తాను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నానని, అయితే అధికారం తలకు ఎక్కించుకోలేదని అన్నారు. ఏక్‌నాథ్ షిండే శిబిరాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ''పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటే ప్రజల ముందుకు వెళ్లండి. మీ అభిప్రాయాలు చెప్పండి. దానిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారు'' అని ఉద్ధవ్ అన్నారు. రెండున్నరేళ్లుగా తాను సీఎంగా ఉన్నప్పటికీ అధికార మదం తలకెక్కించుకోలేదని, అధికారం వచ్చినా పోయినా విధేయతతో ఉండాలని బాలాసాహెబ్ తరచు చెప్పేవారని, అదే హుందాతనంతో తాను వ్యవహరిస్తున్నానని చెప్పారు. అయితే, అనాలోచితంగా, నిర్లక్ష్యంతో వ్యవహరించే వారు మాత్రం రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

Updated Date - 2022-08-02T01:28:06+05:30 IST