త్వరలో Udayanidhiకి మంత్రి పదవి?

ABN , First Publish Date - 2022-05-03T12:56:36+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, చేపాక్‌ -ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధికి త్వరలో మంత్రి పదవి వరించనుందా?.. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చురుకైన పాత్ర

త్వరలో Udayanidhiకి మంత్రి పదవి?

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, చేపాక్‌ -ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధికి త్వరలో మంత్రి పదవి వరించనుందా?.. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన్ని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించారా?.. అవుననే అంటున్నాయి డీఎంకేలోని విశ్వసనీయవర్గాలు. ఈ నెలాఖరులోగా ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ నెల 7వ తేదీకి స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వచ్చి యేడాది పూర్తికానుంది. ఆ సందర్భంగా ఉదయనిధికి మంత్రి పదవి లభించడం ఖాయమని పార్టీ సీనియర్‌ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు ఉదయనిధి సినిమాల్లో నటిస్తూ అడపదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలో పార్టీ నేతలంతా రాజకీయాల్లోకి రావాలంటూ అతనిపై ఒత్తిడి చేసేవారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉదయనిధి పరపతి ఉన్నట్టుండి తారస్థాయికి చేరింది. ఆ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. డీఎంకే అభ్యర్థులకే కాకుండా మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా ఆయన ప్రచారం చేసిన తీరు చూసి పార్టీ సీనియర్లు సైతం అచ్చెరువొందారు. స్టాలిన్‌ లాగే ఉదయనిధిలోనూ నాయకత్వ లక్షణాలున్నాయంటూ అభినందించారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఒక్కసీటు మినహా అన్ని స్థానాల్లోనూ డీఎంకే కూటమి ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచి ఉదయనిధికి పార్టీలోనూ ప్రాధాన్యత పెరిగింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉదయనిధి పార్టీ సభలు, కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఇక శాసనసభ ఎన్నికల్లో ఉదయనిధి ఇటుక పట్టుకుని మదురై ఎయిమ్స్‌కు చెందిన ఇటుక అదేనంటూ విమర్శనాత్మకంగా చేసిన ప్రచారం పార్టీ ప్రచారానికే హైలెట్‌గా నిలిచింది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఉదయనిధి ప్రచారం కూడా దోహదపడినట్లు సీనియర్‌ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఉదయనిధి చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో నటించడం తగ్గించుకుని, పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిసారించారు. డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉదయనిధి ఆ విభాగం శ్రేణులతో పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొని తన సత్తా చాటుకుంటూ వస్తున్నారు. గత యేడాది మే ఏడున డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడే ఉదయనిధి మంత్రి అవుతారని పార్టీ నాయకులంతా భావించారు. కానీ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ తనయుడికి వెంటనే మంత్రిపదవిని ఇస్తే ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురవుతాయని భావించి ఉదయనిధిని నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టిసారించాలని ఆదేశించారు. స్టాలిన్‌ సలహా మేరకు ఉదయనిధి తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఆయా శాఖల మంత్రుల ద్వారా పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలోకి వచ్చి యేడాది పూర్తికావటంతో ఉదయనిధికి మంత్రిపదవి కట్టబెట్టడానికి ఇదే అనువైన సమయమని మంత్రులంతా స్టాలిన్‌కు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయనిధికి మంత్రి పదవి లేకపోయినా, మంత్రులు, శాసనసభ్యులంతా ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు.  ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇస్తున్నట్లే ఉదయనిధికి కూడా మంత్రులు స్వాగత సత్కారాలు కూడా చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఉదయనిధికి ఈ నెలాఖరున మంత్రి పదవి లభించటం ఖాయమని తెలుస్తోంది. స్టాలిన్‌లాగే ఉదయనిధికి కూడా పురపాలక శాఖను కేటాయించే అవకాశముందని డీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే విధంగా డీఎంఏ సీనియర్‌ నేత టీఆర్‌ బాలు తనయుడు, మన్నార్‌గుడి ఎమ్మెల్యే టీఆర్బీ రాజా, తిరువికనగర్‌ ఎమ్మెల్యే తాయగంకవికి కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది.

Read more