Udayanidhi ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ తోసివేత

ABN , First Publish Date - 2022-02-26T16:26:02+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన ఉదయనిధి

Udayanidhi ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ తోసివేత

చెన్నై: శాసనసభ ఎన్నికల్లో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన ఉదయనిధి అన్నాడీఎంకే మిత్రపక్షం పీఎంకే అభ్యర్థికంటే 69వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉదయనిధి గెలుపును సవాలు చేస్తూ ఆ నియోజకవర్గంలో దేశియ మక్కల్‌ కట్చి తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఎంఎల్‌ రవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉదయనిధి నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై పెండింగ్‌లో ఉన్న నేర సంబంధింత కేసుల వివరాలను పేర్కొనలేదని, ఆ నామినేషన్‌ చెల్లదంటూ ప్రకటించి ఆయన గెలుపును రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ పలుమార్లు విచారణకు వచ్చినా ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీంతో కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తి వి. భారతిదాసన్‌ ఇరువైపు న్యాయవాదులు పదే పదే వాయిదాలు కోరుతుంటే పిటిషన్‌ తీరును బట్టి ఉత్తర్వు జారీచేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇటీ వల మళ్ళీ ఈ పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు పిటిషనర్‌ కేసును వాపసు చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఉదయనిధి తరఫు న్యాయవాది పిటిషనర్‌ ఎన్నికల్లో నామినేషన్‌కు సంబంధించిన డిపాజిట్‌ను కూడా చెల్లించలేదని, అలాంటప్పుడు కేసు ఉపసంహరణకు అనుమతించకుండా పిటిషన్‌ను తోసి పుచ్చడం సమంజసంగా ఉంటుందని న్యాయమూర్తికి సూచించారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వు వెలువరించకుండా వాయిదా వేశారు. చివరకు శుక్రవారం న్యాయమూర్తి భారతిదాసన్‌ ఈ పిటిషన్‌పై ఉత్తర్వు జారీ చేశారు. ఎన్నికల నామినేషన్‌కు డిపాజిట్‌ కూడా చెల్లించక పిటిషన్‌ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించ బోమని, పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నామని ప్రకటించారు.

Updated Date - 2022-02-26T16:26:02+05:30 IST