రంజాన్‌ ఉపవాస దీక్షకు ‘రాజా’ మేలు కొలుపు!

ABN , First Publish Date - 2022-04-25T04:25:15+05:30 IST

ఆయన అసలు పేరు షేక్‌ ఖాదిర్‌సా. మైక్‌సెట్టు రాజాగా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరచితుడు. ఉదయగిరి పట్టణం దేవలాలగడ్డకు చెందిన మీరాసా, ఇమాంబీలకు ఆరుగురు సంతానం.

రంజాన్‌ ఉపవాస దీక్షకు   ‘రాజా’ మేలు కొలుపు!
ఇంటిపైన అమర్చిన మైక్‌లు

43 ఏళ్లుగా కొనసాగింపు

అదే బాటలో కుమారులు

ఉదయగిరి, ఏప్రిల్‌ 24: ఆయన అసలు పేరు షేక్‌ ఖాదిర్‌సా. మైక్‌సెట్టు రాజాగా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరచితుడు. ఉదయగిరి పట్టణం దేవలాలగడ్డకు చెందిన మీరాసా, ఇమాంబీలకు ఆరుగురు సంతానం. వీరిలో షేక్‌ ఖాదిర్‌షా(రాజా) రెండో కుమారుడు. ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. పేదరికంతో కుటుంబ పోషణ కష్టమైన నేపథ్యంలో చదువుకు స్వస్తి చెప్పిన ఖాదిర్‌షా శుభ కార్యాలకు మైక్‌సెట్‌, లైటింగ్‌ పనులకు వెళ్లేవాడు. కొంతకాలం అనంతరం అతను మైక్‌సెట్‌ రాజాగా గుర్తింపు పొందాడు. రంజాన్‌ మాసం వచ్చిదంటే ఉపవాసాలకు ఆయన మేలు కొలుపు. నెలంతా తెల్లవారుజామున మూడు గంటలకు మేల్కొని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఉపవాసకులను మేలు కొలుపుతూ 43 ఏళ్లుగా ఆయన రంజాన్‌ రాజాగా మన్ననలు పొందుతున్నారు. ఓ ఉపవాసకుల్లారా, అమ్మ, అక్క, చెల్లెలారా, అన్నదమ్ముల్లారా, బంధుమిత్రుల్లారా మేల్కొనండి.. సహర్‌ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయంటూ అప్రమత్తం చేస్తూ దాదాపు గంటన్నరపాటు నెల రోజులు తన సొంత మైకు ద్వారా అప్రమత్తం చేస్తుంటారు. అదే కోవలో అతని ఇద్దరి కుమారులు షాజహాన్‌, మహమ్మద్‌అలీలు కలిసి తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొని ఉపవాసకులను మేల్కొపుతున్నారు. ఉపవాస దీక్షకు సిద్ధం చేసే రాజా, అతని కుటుంబీకులంటే రంజాన్‌ నెలలో ప్రతి ముస్లిం ఎంతో అప్యాయంగా పలకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షాపరులను నెల పొడవునా మేల్కొపుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇటీవల రాజా పక్షవాతానికి గురై కొద్ది పాటి అనారోగ్యంబారినపడ్డారు. అరోగ్యం సహకరించకపోయినా ప్రతి ఏటా కొనసాగించినట్లు తన సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

ఉపవాసదీక్షాపరుల కోసం...

తాను ప్రతిఏటా రంజాన్‌ మాసంలో తెల్లవారుజాము నుంచి ఉపవాసదీక్ష ప్రారంభమయ్యే వరకు తన మైక్‌ ద్వారా ఉపవాస దీక్షాపరులను మేలుకొల్పుతాను. ఉపవాసదీక్ష బూనాలని అనుకుని నిద్రమత్తులో లేవలేని వారికి నా పిలుపు ఎంతో మేలు చేకూరుస్తోంది. ఉపవాసదీక్షాపరులకు రంజాన్‌ మాసమంతా నేను చేసే ఈ చిన్న సహాయం పుణ్యంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని దేవుడు తనకు కల్పించిన భాగ్యం.

- షేక్‌ ఖాదిర్‌సా



Updated Date - 2022-04-25T04:25:15+05:30 IST