Udaipur Tailor Murder: ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2022-07-14T03:39:02+05:30 IST

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్ట్‌లు పెట్టాడని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన కేసు దర్యాప్తులో..

Udaipur Tailor Murder: ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్ట్‌లు పెట్టాడని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కీలక సమాచారం లభించిందని ఎన్ఐఏ, ఐబీ వర్గాలు తెలిపాయి. నిందితులు పాకిస్తాన్‌కు చెందిన 18 మొబైల్ నెంబర్లతో మాట్లాడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ నెంబర్లలో దాదాపు 300 మంది మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 'దావత్-ఎ-ఇస్లామీ' సంస్థతో సంబంధం ఉన్న చాలా మంది పాకిస్తాన్‌తో అనుసంధానంలో ఉన్నారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. 18 నెంబర్ల ద్వారానే చర్చలు జరిపినట్లు అనుమానాలు ఉన్నాయని ఎన్ఐఏ సందేహం వ్యక్తం చేసింది. హత్య ఘటనలో నిందితులను మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌, మహమ్మద్‌ ఘోష్‌గా గుర్తించి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరినీ రాజస్థాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దర్జీ కన్హయ్యను తామే హత్యచేసినట్లు ఇద్దరు వ్యక్తులు వీడియో విడుదల చేశారు. హత్య తాలూకు వీడియో, హత్యను చేసినట్లుగా అంగీకరిస్తున్న వీడియోతో పాటు మూడో వీడియోనూ విడుదల చేశారు. రెండో వీడియోలో ఆ ఇద్దరూ తమ చేతుల్లోని కత్తులు చూపుతూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బెదిరించారు.



అందులో ఓ వ్యక్తి.. ‘నా పేరు మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌. నా పక్కన ఉన్నది ఘోష్‌ మహమ్మద్‌ భాయ్‌ (మహ్మద్‌ ఘోష్‌). ఉదయ్‌పూర్‌లో ఒకరి తల నరికేశాం. ఏయ్‌.. నరేంద్ర మోదీ, విను! నిప్పు నువ్వు రాజేశావు. మేం ఆర్పుతాం. ఇన్షా ఆల్లా.. ఈ కత్తి నీ మెడ దాకా కూడా వస్తుంది. ఉదయ్‌పూర్‌ వాస్తవ్యులారా.. ఇప్పుడు ఒక్కటే నినాదం. తప్పు చేస్తే తల తెగిపడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. కాగా నిందితులు విడుదల చేసిన మూడో వీడియో జూన్ 17న చిత్రీకరించారు. హతుడిని ఉదయ్‌పూర్‌కే చెందిన కన్హయ్యా లాల్‌గా గుర్తించారు. మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పది రోజుల క్రితం కన్హయ్యాలాల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులకు, కన్హయ్యకు మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. అనంతరం కన్హయ్యాలాల్‌కు వారి నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్నాళ్లు షాపు మూసేసి అజ్ఞాతంలో గడిపిన ఆయన మళ్లీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కాగా హత్య జరిగిన తీరును బట్టి పక్కా పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Updated Date - 2022-07-14T03:39:02+05:30 IST