Nupur Sharmaపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-01T17:06:46+05:30 IST

ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

Nupur Sharmaపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.నుపుర్‌శర్మ వ్యాఖ్యల వల్లే ఉదయ్‌పూర్‌ ఘటన జరిగిందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశ ప్రజలకు మీడియా ద్వారా నుపుర్‌శర్మ క్షమాపణ చెప్పాలని సుప్రీం కోరింది.ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పెను వివాదానికి దారితీసిన నుపుర్ శర్మ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. టెలివిజన్‌లో నూపుర్ యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలని సుప్రీం పేర్కొంది.ప్రవక్తపై ఆరోపించిన ఆరోపణలపై అనేక రాష్ట్రాల్లో నుపుర్ శర్మపై నమోదైన కేసులన్నింటినీ దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నూపుర్ శర్మ చేసిన అభ్యర్థనను విచారించిన సుప్రీంకోర్టు ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నుపుర్ శర్మ దేశ భద్రతకు ముప్పు తెచ్చిందని  సుప్రీంకోర్టు పేర్కొంది.


‘‘బీజేపీకి ఒక అధికార ప్రతినిధి అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చింది చెప్పకూడదు కదా...మీలాంటి వ్యక్తులకు ఏ మతం పట్ల గౌరవం లేదు.... మీరు గౌరవిస్తే అన్ని మతాలను గౌరవించాలి’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది. చీప్ పబ్లిసిటీ, పేరు మోసిన పొలిటికల్ ఎజెండాతో ఈ ప్రకటనలు చేస్తారా.... ఇలాంటి ప్రకటనల అవసరం ఏముందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు జాతికి క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది.టీవీలో చేసిన ప్రకటనలు నుపుర్ శర్మ అహంకారాన్ని తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించింది.ఈ కార్యక్రమం నిర్వహించిన ఛానల్ యాంకర్‌పై కూడా కేసు దాఖలు చేసి ఉండాల్సిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.తనపై దేశవ్యాప్తంగా దాఖలైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్బంగా సుప్రీం తీవ్రస్థాయిలో మండి పడింది.


దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను ఢిల్లీకి మార్చాలని సుప్రీంకోర్టులో నుపుర్ శర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.‘‘టీవీలో జరిగిన చర్చంతా మేం చూశాం... మీరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు,దేశవ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో మీరు మెజిస్ట్రేట్‌ల ముందు హాజరు కావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసిన నుపుర్ శర్మనుద్ధేశించి సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీ స్థాయిలో ఉన్న పొలిటిషన్ అన్ని మతాలను, కులాలను గౌరవించాలి, ముహమ్మద్ ప్రవక్తపై మీరు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం. దేశంలో ఎలాంటి ఘటన జరిగిన మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది’’ అని సుప్రీం జడ్జి స్పష్టం చేశారు.


రిట్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి.. 

పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది కోరిన నేపథ్యంలో రిట్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చినట్టు సుప్రీంకోర్ట్ వెల్లడించింది. చట్టప్రకారం ప్రత్యమ్నాయ న్యాయమార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కి ఉంటుందని ఈ సందర్భంగా కోర్ట్ పేర్కొంది. ఉపసంహరించుకోవడంతో పిటిషన్‌ని కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

Updated Date - 2022-07-01T17:06:46+05:30 IST