UAE సర్కారు కీలక ప్రకటన.. ఏదైనా కారణాలతో ఉద్యోగం కోల్పోతే..!

ABN , First Publish Date - 2022-05-11T17:37:15+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) ఇప్పటికే పలు కీలక సంస్కరణలతో అటు దేశ పౌరులతో పాటు ఇటు ప్రవాసులను ఆకట్టుకుంది.

UAE సర్కారు కీలక ప్రకటన.. ఏదైనా కారణాలతో ఉద్యోగం కోల్పోతే..!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) ఇప్పటికే పలు కీలక సంస్కరణలతో అటు దేశ పౌరులతో పాటు ఇటు ప్రవాసులను ఆకట్టుకుంది. తాజాగా నిరుద్యోగ బీమా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆ దేశంలో నిరుద్యోగ బీమా అమలు కానుంది. ఈ మేరకు సోమవారం యూఏఈ మంత్రివర్గం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక పోటీ తీవ్రమవుతున్నందున ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించడానికి గల్ఫ్ దేశం ప్రవేశపెట్టిన తాజా సంస్కరణగా ఇది వస్తుంది. ఇక కేబినెట్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ UAE ప్రధాన మంత్రి, ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్‌ ద్వారా కీలక విషయాన్ని వెల్లడించారు. బీమా చేయబడిన కార్మికులు ఒకవేళ ఏదైనా కారణాలతో ఉద్యోగం కోల్పోతే పరిమిత కాలానికి కొంత మొత్తాన్ని పొందడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. "కార్మిక మార్కెట్ పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కార్మికులకు సామాజిక భద్రతను అందించడం, అందరికీ స్థిరమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే ఉద్యోగ బీమా ప్రధాన ఉద్దేశం" అని దుబాయ్ పాలకుడు అన్నారు. 


అయితే, UAE పౌరులతో పాటు ఆ దేశ పౌరులు కాని నివాసితులకు ఈ నియమం సమానంగా వర్తిస్తుందా అనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ఇదిలాంటే.. కువైత్, ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు పౌరులకు కొన్ని రకాల నిరుద్యోగ మద్దతును కలిగి ఉన్నాయి. ఇక బహ్రెయిన్ అయితే విదేశీ కార్మికుల కోసం నిరుద్యోగ బీమాను కూడా అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాలలో విదేశీయులకు ఉపాధి ఆధారంగా నివాసం ఉండటానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే కార్మికుడు దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది.  

Read more