కొచ్చి, తిరువనంతపురానికి యూఏఈ ప్ర‌త్యేక విమానాలు

ABN , First Publish Date - 2020-04-03T15:04:16+05:30 IST

మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ కారణంగా యూఏఈలో చిక్కుకుపోయిన ప్ర‌వాసుల‌ను స్వ‌దేశాల‌కు పంపించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు యూఏఈ తాజాగా ప్ర‌క‌టించింది.

కొచ్చి, తిరువనంతపురానికి యూఏఈ ప్ర‌త్యేక విమానాలు

యూఏఈ: మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ కారణంగా యూఏఈలో చిక్కుకుపోయిన ప్ర‌వాసుల‌ను స్వ‌దేశాల‌కు పంపించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు యూఏఈ తాజాగా ప్ర‌క‌టించింది. దీనిలో భాగంగా కొచ్చి, తిరువ‌నంత‌పురానికి విమానాలు న‌డ‌ప‌నుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల‌కు 14 ప్ర‌త్యేక విమాన స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా యూఏఈ పేర్కొంది. కొచ్చి, తిరువనంతపురం కాకుండా భారతదేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులకు విమానాలు నడుపుతామ‌ని యూఏఈ వెల్ల‌డించింది. ఏప్రిల్ 6 నుంచి ఈ ప్ర‌త్యేక స‌ర్వీసులు నడవనున్నాయి.


త‌మ దేశంలో చిక్కుకుపోయిన ప్ర‌వాసుల‌ను వారి దేశాల‌కు త‌ర‌లించేందుకు ఇటీవ‌ల యూఏఈ విమాన స‌ర్వీసుల‌కు అనుమతి ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాతి రోజే దీనికి భార‌త ప్ర‌భుత్వం కూడా అంగీక‌రించింది. ఎయిర్ అరేబియా సైతం ప్ర‌వాసుల‌ను వారి దేశాల‌కు పంపించేందుకు ప్ర‌త్యేక విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు ఇండియా కూడా ఇక్క‌డ చిక్కుకుపోయిన బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ వాసుల‌ను వారి స్వ‌దేశాల‌కు పంపించేందుకు ప్ర‌త్యేక ఎయిర్ ఇండియా స‌ర్వీసుల‌ను రెడీ చేసింది.


ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ మాట్లాడుతూ త‌మ ఎయిర్ లైన్స్ ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఐర్లాండ్ పౌరుల‌ను ఇక్క‌డి నుంచి వారి దేశాల‌కు త‌ర‌లించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్ర‌కారం ఎయిరిండియా మొత్తం 18 విమానాల‌ను న‌డ‌ప‌నుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. "వారి పౌరులను స్వదేశానికి తిరిగి రప్పించడానికి చార్టర్ విమానాల కోసం ఈ దేశాల రాయబార కార్యాలయాలు మమ్మల్ని సంప్రదించాయి. ఈ ఒప్పందాలు వాణిజ్య ప్రాతిపదికన చేసుకున్నాయ‌ని" పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ మీడియా సమావేశంలో బన్సాల్  తెలిపారు. కాగా, తిరుగుప్రయాణంలో విమానాలు ఖాళీగా వస్తాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Updated Date - 2020-04-03T15:04:16+05:30 IST