Expo 2020 Dubai: ఆ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు

ABN , First Publish Date - 2021-10-07T14:22:58+05:30 IST

యూఏఈ ప్రభుత్వం దుబాయ్ ఎక్స్‌పో 2020ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Expo 2020 Dubai: ఆ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు

దుబాయ్: యూఏఈ ప్రభుత్వం దుబాయ్ ఎక్స్‌పో 2020ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కోసం ఓ అద్భుత ప్రపంచాన్నే సృష్టించింది. 1080 ఎకరాల్లో ఏర్పాటైనా ఈ ఎగ్జిబిషన్ కన్నులపండువగా కొనసాగుతోంది. మొత్తం 192 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ ఎక్స్‌పో వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరగనుంది. ఇదిలాఉంటే.. తాజాగా దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అధ్యక్షతన భేటీ అయిన యూఏఈ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవులు(వేతనంతో కూడిన) ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ఎక్స్‌పోను సందర్శించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.


ఇక ఇటీవల దుబాయ్ సైతం ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు రెండు రోజుల క్రితం యూఏఈ ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పరిపాలన మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులందరికీ 8 రోజుల వేతనంతో కూడిన సెలవులను ప్రకటించారు. ఉద్యోగులు వారి కుటుంబాలు ఎక్స్‌పో 2020 దుబాయ్‌ని సందర్శించడానికి వీలు కల్పించారు. ఇక సుస్థిరత, అవకాశాలు, మొబిలిటీ అనే మూడు థీమ్స్‌పై వివిధ దేశాల సంస్థలు తమ వినూత్న ఆలోచనలను ఈ ఎక్స్‌పోలో పంచుకోనున్నాయి. దుబాయ్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించడంతో పాటూ అభివృద్ధిలో కొత్త అవకాశాలను సృష్టించడమే ఈ ఎక్స్‌పో ఏర్పాటు వెనక ప్రభుత్వానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. 

Updated Date - 2021-10-07T14:22:58+05:30 IST