ఆతిథ్యానికి మేం సిద్ధం

ABN , First Publish Date - 2020-07-23T09:17:22+05:30 IST

ఈసారి లీగ్‌ దాదాపు యూఈఏలోనే జరిగే అవకాశముందని టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా ప్రకటన వెలువడగానే ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్న సంగతి

ఆతిథ్యానికి మేం సిద్ధం

బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం 

ఎదురు చూస్తున్నాం: యూఏఈ


ఈసారి లీగ్‌ దాదాపు యూఈఏలోనే జరిగే అవకాశముందని టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా ప్రకటన వెలువడగానే ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మాత్రం.. లీగ్‌పై ఇప్పటిదాకా బీసీసీఐ నుంచి తమకెలాంటి అధికారిక సమాచారం లేదని చెప్తోంది. ఒకవేళ తమకు ఆతిథ్యమిచ్చే అవకాశం వస్తే.. అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని భారత్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. ‘ఐపీఎల్‌ యూఏఈలో జరగనుందని మీరెలా అనుకుంటున్నారో, మాకు అంతే తెలుసు. ఈ విషయమై బీసీసీఐ నుంచి మమ్మల్నెవరూ సంప్రదించలేదు. బ్రిజేష్‌ పటేల్‌ వ్యాఖ్యలు మేం కూడా విన్నాం. బహుశా వాళ్లు ఆ దేశ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారేమో. అనుమతి లభించాక మాకు అధికారిక సమాచారం రావొచ్చని అనుకుంటున్నాం’ అని అధికారి వెల్లడించారు.


ఐపీఎల్‌కు తమ వద్ద అన్ని సౌకర్యాలున్నాయనీ.. గతంలో లీగ్‌ను నిర్వహించిన అనుభవం కూడా తమకుందని యూఏఈ అంటోంది. ‘ఐపీఎల్‌ ప్రధానమైన టోర్నమెంట్‌. ఈ అతిపెద్ద బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు సంసిద్ధంగా ఉన్నాం. 2014లో ఈ మేజర్‌ లీగ్‌కు ఆతిథ్యం కూడా ఇచ్చాం. ఈ లీగ్‌ నిర్వహణలో ఉన్న సాధ్యాసాధ్యాలపై మాకు పూర్తి అవగాహన ఉంది’ అని ఈసీబీ అధికారి చెప్పారు. అప్పట్లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌లో తొలి అర్ధభాగం మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఐపీఎల్‌కు యూఏఈ ఆతిథ్యమిచ్చినప్పుడు దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికలుగా మ్యాచ్‌లు నిర్వహించారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన ఇండోర్‌ నెట్స్‌తో పాటు 30కిపైగా పిచ్‌లు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించమన్నా.. తాము అందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ బోర్డు అంటోంది.

Updated Date - 2020-07-23T09:17:22+05:30 IST