గ్రామాల్లో అనుమతులు లేకుండా సెల్‌టవర్‌లు

ABN , First Publish Date - 2021-06-24T05:19:02+05:30 IST

పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. సెల్‌టవర్‌ నిర్వాహకుల స్వార్థం వెరసి గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్‌టవర్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అంతేగాకుండా పంచాయతీలకు సెల్‌టవర్‌ నిర్వాహకులు ప్రతి ఏడాది పన్నులు కూడా చెల్లించడం లేదు. దీంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. అయినప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు.

గ్రామాల్లో అనుమతులు లేకుండా సెల్‌టవర్‌లు
అంకభూపాలపురంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌

వలేటివారిపాలెం, జూన్‌ 23 : పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. సెల్‌టవర్‌ నిర్వాహకుల స్వార్థం వెరసి గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్‌టవర్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అంతేగాకుండా పంచాయతీలకు సెల్‌టవర్‌ నిర్వాహకులు ప్రతి ఏడాది పన్నులు కూడా చెల్లించడం లేదు. దీంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. అయినప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. వలేటివారిపాలెం మండలంలో శాఖవరం, నేకునాంపురం, వలేటివారిపాలెం, పోలినేనిపాలెం, పోకూరు, అయ్యవారిపల్లె, చుండి, పోలినేనిచెరువు, అంకభూపాలపురం, నలదలపూరు, కళ్లవళ్ల గ్రామాలలో 15 ప్రయివేట్‌ సెల్‌టవర్‌లు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాలలో సెల్‌టవర్‌ ఏర్పాటు చేయాలంటే పంచాయతీ అనుమతి పొందాలి. ఏడాది ఒక్కో సెల్‌టవర్‌కు రూ. 2500లు పంచాయతీ కార్యదర్శికి నాన్‌టాక్స్‌ చెల్లించాలి. పంచాయతీ కార్యదర్శులు ఇంటిపన్నులు లాగానే సెల్‌టవర్‌ నిర్వాహకులు చెల్లించే నానటాక్స్‌ను కూడా ట్రెజరీలో జనరల్‌ ఫండ్‌లో జమ చేయాలి. అయితే పంచాయతీ అధికారులు సెల్‌టవర్‌ నిర్వాహకుల వద్ద నాన్‌టాక్స్‌ వసూలు చేయడం లేదు.   అయినప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు.  సంబంధిత అధికారులు స్పందించి సెల్‌టవర్‌ నిర్వాహకుల నుంచి పన్నులు వసూలుచేసి పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నోటీసులు జారీ చేశాం

 - సుమంత్‌, పంచాయతీ విస్తరణాధికారి, వలేటివారిపాలెం

మండలంలో 15 సెల్‌టవర్‌లు ఉన్నాయి. ఏ ఒక్క సెల్‌టవర్‌ నిర్వాహకుడు  నాన్‌టాక్స్‌ చెల్లించడం లేదు. నోటీసులు కూడా జారీ చేశాం. అయినా స్పందించడం లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Updated Date - 2021-06-24T05:19:02+05:30 IST