Hyderabad లో ఇక్కడ యూటర్న్‌ కోసం రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే..!

ABN , First Publish Date - 2021-07-22T19:19:49+05:30 IST

. పని జరగడం లేదు కదా... చౌరస్తా మధ్యలోనుంచి దారి ఇవ్వమంటే...

Hyderabad లో ఇక్కడ యూటర్న్‌ కోసం రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే..!

హైదరాబాద్‌ సిటీ : వర్షానికి నగర రోడ్లు జలమయం కావడం.. చెరువులను తలపించడం కొత్త విషయమేమీ కాదు. పాతబస్తీలోని పలు రహదారులు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు వరకు నీటితో నిండిపోతున్నాయి. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల పాతబస్తీలోని పలు కూడళ్ల వద్ద వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, అభివృద్ధి పేరిట ఆర్భాటంగా పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బహదూర్‌పురా కూడలి వద్ద నీరు వరదలా పారుతోంది. హైవేపై ప్రయాణించే వాహనదారులు, జూ పార్కు సందర్శనకు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు.


నత్తనడకన ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు

బహదూర్‌పురా చౌరస్తా నాలుగు రోడ్ల కూడలి. నాలుగేళ్లుగా చౌరస్తా స్వరూపమే కోల్పోయింది. అక్కడ ఫ్లై ఓవర్‌ కడతామని పని ప్రారంభించిన అధికారులు గుర్తుకొచ్చినప్పుడు ఓ రాయి పడేస్తారే తప్ప సీరియ్‌సగా పని సాగింది లేదు. పనులు జరుగుతున్నాయనే సాకుతో చౌరస్తాను బ్లాక్‌ చేశారు. ప్రత్యామ్నాయ రోడ్లే లేని ఆ చౌరస్తా నుంచి ఎదురు రోడ్డుకు వెళ్లాలంటే వాహనదారుడు ఓ వైపు బహదూర్‌పురా పీఎస్‌ వరకు, మరో వైపు జూపార్కు వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. రెండు కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. బెంగళూరు హైవేగా ఉన్న ఆ రోడు ఫ్లైఓవర్‌ నిర్మాణం పేరిట కుచించుకుపోయింది. ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ అరగంటసేపు యూటర్న్‌ కోసం ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని జరగడం లేదు కదా... చౌరస్తా మధ్యలోనుంచి దారి ఇవ్వమంటే ట్రాఫిక్‌ పోలీసులు అంగీకరించడం లేదు.


శాఖల మధ్య సమన్వయ లోపం

శాఖల మధ్య సమన్వయ లోపంతో వర్షా కాలంలో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బహదూర్‌పురా నుంచి నాలుగు అడుగుల లోతు నీటిలో వాహనదారులు వెళ్లాల్సి రావడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఫ్లై ఓవర్‌ సామగ్రి, వాహనాల పార్కింగ్‌తో రోడ్డు ఇరువైపులా కుచించుకుపోయి నీరు వెళ్లే దారిలేకుండా పోయింది. వారం రోజులుగా పరిస్థితిని గమనిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడం లేదు. పక్కనే ఉన్న మజ్లిస్‌ ఎమ్మెల్యే ప్రతిరోజూ పరిస్థితిని చూస్తున్నా ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-07-22T19:19:49+05:30 IST