మధుమేహం మహమ్మారి పొంచి ఉంది.. జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-08-24T05:30:00+05:30 IST

మధుమేహం ముప్పుకు ముందు రూపం... ప్రిడయాబెటిస్‌. ఇది ఇతరత్రా వ్యాధి పరీక్షల్లో యాధృచ్చికంగా బయటపడుతూ ఉంటుంది. లేదా తీవ్ర ఆరోగ్య సమస్యల రూపంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ...

మధుమేహం మహమ్మారి  పొంచి ఉంది.. జాగ్రత్త!

మధుమేహం ముప్పుకు ముందు రూపం... ప్రిడయాబెటిస్‌. ఇది ఇతరత్రా వ్యాధి పరీక్షల్లో యాధృచ్చికంగా బయటపడుతూ ఉంటుంది. లేదా తీవ్ర ఆరోగ్య సమస్యల రూపంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే జీవనశైలి మార్పులతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడం తేలికే అంటున్నారు వైద్యులు!


ప్రిడయాబెటిక్‌లో చక్కెర స్థాయిలు సహజం కంటే కాస్త ఎక్కువగా, టైప్‌2 మధుమేహం పరిమాణం కంటే కాస్త తక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్య పరిస్థితిలో ఆరోగ్యం తీవ్రంగా కుదేలయ్యే పరిస్థితి తలెత్తే వరకూ మధుమేహ లక్షణాలేవీ బయటపడవు. కాబట్టి మధుమేహం తలెత్తే పరిస్థితి ఉన్నవాళ్లు వైద్యుల ద్వారా రక్తపరీక్షలు చేయించుకుంటూ చక్కెర స్థాయిల మీద ఓ కన్నేసి ఉంచాలి. మరీ ముఖ్యంగా...


  1. స్థూలకాయులు
  2. 45 ఏళ్లు దాటినవాళ్లు
  3. టైప్‌2 డయాబెటిస్‌ కుటుంబ చరిత్ర ఉన్నవాళ్లు
  4. వారంలో కనీసం మూడు సార్లు కూడా వ్యాయామం చేయనివాళ్లు
  5. గర్భంతో ఉన్నప్పుడు మధేమేహం బారిన పడినవాళ్లు
  6. పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ ఉన్నవాళ్లు

ఈ కోవకు చెందినవాళ్లు రెట్టింపు అప్రమత్తంగా నడుచుకోవాలి.


పొంచి ఉండే ముప్పులు...

ప్రిడయాబెటిక్‌ అని నిర్థారణ అయినప్పుడు ఆ పరిస్థితిని అంగీకరించి, అందుకు తగ్గట్టు జీవనశైలి మార్పులు చేసుకోవాలి. మందులు వాడుతూ దాన్ని అదుపులో ఉంచుకుంటే సరిపోతుందిలే! అనుకోకుండా దాంతో జతకట్టే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వాటిని తిప్పి కొడుతూ ఉండాలి. అప్పుడే సుగర్‌ ఫ్రీ లైఫ్‌


సొంతమవుతుంది. ఇందుకోసం..

బరువు తగ్గాలి: అధిక బరువును వ్యాయామంతో ఏ కొంత తగ్గించుకోగలిగినా టైప్‌2 డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుంది. మొత్తం శరీర బరువులో 7ు తగ్గినా స్పష్టమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయాలి. అంటే వారంలో ఐదు రోజుల పాటు, రోజుకు 30 నిమిషాల నడక సరిపోతుంది. బ్రిస్క్‌ వాక్‌ లేదా అంతే సమానమైన ఫలితం దక్కే ఇతరత్రా వ్యాయామాలు కూడా ఎంచుకోవచ్చు. 

సరిపడా నిద్ర: రోజుకు 8 గంటలు తగ్గకుండా నిద్ర పోవాలి. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతూ, ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు మానుకోవాలి. అలాగే మధ్యాహ్న సమయాల్లో కునుకులకు స్వస్థి చెప్పాలి. నిద్ర లేమి తీపి తినాలనే కోరికను పెంచుతుంది. ఫలితంగా మరుసటి ఉదయం తీయని పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటాం. అధిక క్యాలరీలు కలిగి ఉండే తీపి వల్ల శరీర బరువు పెరుగుతుంది.

సమతులాహారం: ప్రొటీన్లు, పీచు, పిండిపదార్థాలు సమతులంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పరిమాణాలు కాకుండా తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి. వీలైనంత ఎక్కువ పీచు, ప్రొటీన్లు, వీలైనంత తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, తీపి తక్కువ ఉండే పళ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తృణధాన్యాలను కూడా తీసుకుంటూ ఉండాలి. పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలకు బదులుగా ముడి బియ్యం, పొట్టుతో కూడిన పప్పుదినుసులను ఎంచుకోవాలి.

దురలవాట్లు: ధూమపానం, మద్యపానం అలవాట్లను మానేయడం ద్వారా ప్రిడయాబెటిక్‌ మరింత పెరగకుండా ఆపే వీలుంది. 




మధుమేహం ముప్పులు బోలెడు

అదుపు తప్పిన షుగర్‌ లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అవేంటంటే....

నయనం ప్రధానం: మధుమేహం అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవీ కనిపించవు. రెటినోపతీలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది. కాబట్టి ఈ సమస్యను ముందుగా కనిపెట్టే ‘ఫండస్‌ ఎగ్జామినేషన్‌’ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. కంట్లో డ్రాప్స్‌ వేసి 15 నిమిషాలు కూర్చోబెట్టి కంటిని పరీక్ష చేసి, రెటీనోపతి ఉందా? ఏ దశలో ఉంది? అనే విషయాలను వైద్యులు తేలికగా కనిపెడతారు. కాబట్టి ఏడాదికోసారి తప్పనిసరిగా మధుమేహులు కంటి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.


వడపోసే జల్లెడలు: పెద్ద రక్తనాళాలతో సంబంధం ఉండే మూత్రపిండాలు మధుమేహం అదుపు తప్పితే దెబ్బ తింటాయి. రక్తంలోని చక్కెర నేరుగా సరఫరా అవుతూ ఉంటే మూత్రపిండాల నుంచి ప్రొటీన్లు లీక్‌ అవటం మొదలు పెడతాయి. ఇదే కొనసాగితే మూత్రపిండాలు పాడై పని చేయకుండా పోతాయి. అప్పుడిక డయాలసిస్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ సమస్యలోనూ చివరి దశ వరకూ లక్షణాలేవీ ఉండవు. కాళ్ల వాపులు కనిపించినా అప్పటికే మూత్రపిండాల సమస్య చివరి దశకు చేరుకుందని అర్థం. మూత్రపిండాలను సంరక్షించుకోవాలంటే ప్రొటీన్‌ లీకేజ్‌ను ముందుగానే గుర్తించి దాన్ని నియంత్రించే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం సంవత్సరానికోసారి ‘ప్రొటీన్‌ ఎక్స్‌క్రీషన్‌ ఫ్రమ్‌ కిడ్నీ’ (మైక్రో ఆల్‌బ్యుమిన్‌) పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.


స్పర్శనిచ్చే నరాలు: చిన్న నరాల మీద మధుమేహం ప్రభావం ఎక్కువ. ఇలాంటి చిన్న నరాలు పాదాల్లో ఉంటాయి కాబట్టి ముందుగా అవే దెబ్బ తింటాయి. దాంతో పాదాల్లో స్పర్శ తగ్గి ఎక్కడ అడుగేస్తున్నామో చూసుకోకుండా నడిచేస్తాం. దాంతో పొరపాటున పుండ్లు ఏర్పడతాయి. ఇవి మానటానికి మొండికేస్తాయి. కాబట్టి మధుమేహులు పాదాల్లో మంటలు మొదలవగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. చాలామందికి పాదాల మంటల ద్వారానే మధుమేహం బయటపడుతూ ఉంటుంది. డయాబెటిక్‌ ఫుట్‌ రాకుండా ఉండాలంటే సంవత్సరానికోసారి వైద్యులను కలుస్తూ పాదాలు పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. నరాల పటుత్వం ఏ మేరకు ఉన్నదీ వైద్యులు చేత్తో పరీక్షించి కనిపెట్టగలుగుతారు. 

గుండెలోని మర్మం: మధుమేహుల్లో గుండెకూ నష్టం జరగొచ్చు. వీళ్లకు నిశ్శబ్ద గుండెపోట్లు (సైలెంట్‌ మయొకార్డియల్‌ ఇన్‌ఫాక్షన్‌) రావొచ్చు. మామూలు వ్యక్తుల్లోలా వీళ్లలో ఛాతీ నొప్పి, వాంతులు లాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. మధుమేహుల్లో ఎడమ భుజం నొప్పి, ఆయాసం గుండెపోటు లక్షణాలు. కాబట్టి ఛాతీలో మంట, ఆయాసం, ఎడమ భుజం నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించాలి. గుండె ఆరోగ్యాన్ని చిటికెలో కనిపెట్టగలిగే పరీక్ష ‘ఈసీజి’. కాబట్టి గుండెపోటు వచ్చేవరకూ ఆగకుండా ఏడాదికోసారి ఈసీజీ తీయించుకుంటూ ఉండాలి.

మెదడు పోటు: గుండె నుండి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద రక్తనాళంలో రక్తం గడ్డ అడ్డు పడితే వచ్చే సమస్య ఇది. ఈ స్ట్రోక్‌ హఠాత్తుగా వస్తుంది. దీన్ని నివారించాలంటే గుండెను పరీక్షించుకుంటూ ఉండాలి. ధూమపానం అలవాటుంటే మానుకోవాలి. ‘కెరోటిన్‌ డాప్లింగ్‌’...ఈ పరీక్షలో గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డలు ఉన్నాయేమో తెలుస్తుంది. అయితే ఇది ఫుల్‌ ప్రూఫ్‌ పరీక్ష కాదు. కొందరికి రక్తం గడ్డ ఉన్నా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రాకపోవచ్చు. ఇంకొందరికి అప్పటిదాకా సాఫీగా ఉన్న రక్తనాళంలో అప్పటికప్పుడు గడ్డలు ఏర్పడి స్ట్రోక్‌కు దారి తీయొచ్చు. కాబట్టి మధుమేహులు ఈ సమస్య రాకుండా ధూమపానం మానేయటం, మఽధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను అదుపులో పెట్టుకోవటం లాంటి ముందు జాగ్రత్తలు పాటించాలి.




రక్తం తగ్గిన కాళ్లు: కాళ్లలో ఉండే పెద్ద 

రక్తనాళాలు ఇరుకుగా మారి, రక్త సరఫరా తగ్గటం వల్ల కాళ్లు కుళ్లిపోవటం మొదలు పెడతాయి. పుండ్లు ఏర్పడే గాంగ్రీన్‌ అనే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించపోతే చికిత్స మరింత క్లిష్టమవుతుంది. కాబట్టి నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి ఉంటే సాధారణ కాళ్ల నొప్పులుగా భావించకుండా వెంటనే వైద్యుల్ని కలవాలి. ఈ సమస్యను ముందుగానే కనిపెట్టాలంటే కాళ్ల నొప్పులు అనిపించిన వెంటనే వైద్యుల్ని కలిసి పరీక్ష చేయించుకోవాలి. 


-డాక్టర్‌ సందీప్‌ రెడ్డి గంట

సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.


Updated Date - 2021-08-24T05:30:00+05:30 IST