నేటి నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-22T06:46:36+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎల్‌. రమాదేవి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
త్యాగరాజ ఆరాధానోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

- కొవిడ్‌ నేపథ్యంలో అంతరంగికంగా కార్యక్రమాలు 

వేములవాడ టౌన్‌, జనవరి 21: వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎల్‌. రమాదేవి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రాజన్న ఆలయంలో 69 సంవత్సరాలుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఈ సారి కొవిడ్‌ తీవ్రతతో ఉత్సవాలను అంతరంగికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5.45 గంటలకు స్వస్తి పుణ్యహవచనము, ఉదయం 9.30 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 10 గంటలకు శ్రీమతి బుర్ర అరుణ, కె.పద్మ, కొరిడె నరహరి, ఎన్‌. అనుపమ, బి. రేవతి, ఎస్‌. సునీత, కె.మంజులతో పంచరత్నగానము, 11 గంటలకు  సింహాచల శాస్ర్తితో త్యాగరాజ చరిత్ర హరికథ, సాయంత్రం 5 గంటలకు నాగూర్‌బాబు వేణువు కచేరి వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.  ఆదివారం ఉదయం 6.30 గంటలకు వెల్ది నరసింహమూర్తి హరికథ, ఉదయం 10 గంటలకు ఎం.విజయుడు హరికథ, సాయంత్రం 5 గంటలకు కె. నరహరి అనుపమ, ఆర్‌.హరికృష్ణ బృదం సంగీత కచేరి,  సోమవారం ఉదయం 6.30 గంటలకు  భారతితో హరికథ, ఉదయం 10 గంటలకు  శిఖామణితో హరికథ, సాయంత్రం 5 గంటలకు శ్రిష్ఠి రంగానాథన్‌ శాస్ర్తీయ సంగీతం ఉంటాయని పేర్కొన్నారు.  మంగళవారం ఉదయం 4 గంటలను నాగరాణితో హరికథ, సాయంత్రం 5 గంటలకు వారణాసి జోత్స్నలక్ష్మి, బి.రేవతి బృదంతో సంగీత కచేరి, సాయంత్రం 6 గంటలకు మంగళంపల్లి సూర్యదీప్తి జలతరంగిణి సోలో కచేరి, రాత్రి 7 గంటలకు చిరంజీవాచారి హరికథ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చివరి రోజు బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు బి.లక్ష్మీనారాయణతో  హరికథ, సాయంత్రం 5 గంటలకు ఎ.శ్రీనివాసరాజారావు  సంగీత కచేరి, సాయంత్రం 6.30 గంటలకు పండితులకు సన్మాన కార్యక్రమం, సాయంత్రం 7.30 గంటలకు రఘనందన్‌తో సంగీత కచేరి వంటి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.  ఆదివారం నుంచి బుధవారం వరకు నిత్యం చౌటి లక్ష్మణమూర్తితో త్యాగరాజస్వామివారి సుప్రభాతం ఉటుందని పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-22T06:46:36+05:30 IST