కొవిడ్‌ వ్యాప్తి.. నేటితో రెండేళ్లు పూర్తి

ABN , First Publish Date - 2022-03-02T20:35:23+05:30 IST

మార్చి 2, 2020. సరిగ్గా రెండేళ్లక్రితం.. దేశంలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైన రోజు. అంటే ఒకరినుంచి మరొకరికి కోవిడ్ సోకడం మొదలైంది ఈ రోజు నుంచే.

కొవిడ్‌ వ్యాప్తి.. నేటితో రెండేళ్లు పూర్తి

మార్చి 2, 2020. సరిగ్గా రెండేళ్లక్రితం.. దేశంలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైన రోజు. అంటే ఒకరినుంచి మరొకరికి కోవిడ్ సోకడం మొదలైంది ఈ రోజు నుంచే. అప్పుడు మొదలైన కోవిడ్ వ్యాప్తి ఇప్పటివరకు దాదాపు 44 లక్షల మందికి సోకింది. ఐదు లక్షలకుపైగా బాధితులు మరణించారు. మూడు వేవ్‌లుగా కోవిడ్ దేశాన్ని వణికించింది. తీవ్ర ప్రాణనష్టంతోపాటు, ఆర్థికంగానూ నష్టాన్ని మిగిల్చింది. అయితే, అన్ని అవరోధాల్ని దాటుకుని ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లలో దేశంలో కరోనా మహమ్మారి చూపిన ప్రభావం ఇలా ఉంది.

మొదటివేవ్

మార్చి 3, 2020 నుంచి దేశంలో కరోనా మొదటివేవ్ ప్రారంభమైంది. జూన్, సెప్టెంబర్‌లలో కోవిడ్ కేసులు పీక్స్‌కు చేరుకున్నాయి. దేశంలో వచ్చిన మూడు వేవ్‌లలో అత్యధిక రోజులు సాగింది ఇదే. దాదాపు ఆరు నెలలుపైగా ఫస్ట్‌వేవ్ తీవ్రత కొనసాగింది. మొదటి వేవ్ పూర్తిగా ముగిసేందుకు 346 రోజులు పట్టిందని నిపుణుల అంచనా. ఫస్ట్‌వేవ్ పీక్స్ రోజుల్లో సగటున రోజుకు 93 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొదటివేవ్‌లో మొత్తం 19 లక్షల మందికి కోవిడ్ సోకగా, 1.55 లక్షల మంది మరణించినట్లు అంచనా. కరోనాకు సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం, వ్యాక్సినేషన్ మొదలు కాకపోవడం ఫస్ట్‌వేవ్ ఉధృతికి కారణాలు.


ఉధృతంగా సెకండ్ వేవ్

దేశంలో సెకండ్ వేవ్ గత ఏడాది ఫిబ్రవరి 12న మొదలైంది. డెల్టా వేరియెంట్ కారణంగా మొదటివేవ్ కంటే రెండో వేవ్ ఉధృతి పెరిగింది. ఒకరోజు అత్యధిక కరోనా కేసులు నమోదైంది కూడా ఈ వేవ్‌లోనే. సెకండ్ వేవ్ ప్రారంభమైన 87వ రోజు ఏకంగా 3,91,819 కేసులు నమోదయ్యాయంటే ఇది ఎంత ప్రమాదకరంగా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 24 లక్షల మందికి ఈ వేవ్‌లో కరోనా సోకినట్లు అంచనా. ఎక్కువ మంది రోగులు మరణించింది కూడా సెకండ్‌వేవ్‌లోనే. దాదాపు 3.24 లక్షల మంది మరణించినట్లు అంచనా. డెల్టా వేరియెంట్ వల్ల పేషెంట్లలో ఆక్సిజన్ శాతం భారీగా పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అవసరం పెరిగి, తీవ్ర కొరత ఏర్పడింది. అయితే, చివరకు సరైన చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితి మళ్లీ అదుపులోకొచ్చింది. ఇదే టైమ్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభవడం కొంతమేర ఫలితాన్నిచ్చినా, ఎక్కువ మంది అప్పటికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల డెల్టా వేరియెంట్ ప్రభావం అధికంగా ఉంది. దాదాపు 318 రోజులు సాగిన సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి నెమ్మదిగా కేసుల సంఖ్య పడిపోయింది. 


మూడోవేవ్.. ప్రభావం తక్కువే

మూడు వేవ్‌లలోకెల్లా అత్యంత తక్కువ ప్రభావం చూపింది థర్డ్‌వేవ్. తొందరగానే తగ్గుముఖం పట్టిన వేవ్ ఇది. ఒమిక్రాన్ వేరియెంట్ వల్ల గత ఏడాది డిసెంబర్ 27న దేశంలో థర్డ్‌వేవ్ ప్రారంభమైంది. జనవరి చివర్లో ఒకేరోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇది కూడా మొదటి రెండు వేవ్స్‌‌లాగే తీవ్ర ప్రభావం చూపిస్తుందేమోనని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందేమోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్దగా ప్రభావం చూపకుండానే తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రోజుకు దేశవ్యాప్తంగా సగటున పదివేలకంటే తక్కువ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అందులోనూ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది.

వ్యాక్సినేషన్ ప్రభావం

రెండేళ్లు పూర్తయ్యేసరికి దేశంలో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది. దీనికి ప్రధాన కారణం వ్యాక్సినేషన్. పదిహేనేళ్లు దాటిన వాళ్లలో దాదాపు 95 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. వీరిలో 78 శాతం మంది పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. దీని ప్రభావంతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సోమవారం నాడు 5,804 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వ్యాక్సినేషన్‌తోపాటు కోవిడ్‌కు మరిన్ని చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడం కూడా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. కరోనా విషయంలో రెండేళ్లలో వైద్యరంగం గణనీయమైన ప్రగతి సాధించింది. అలాగే వైద్యరంగంలోని లోపాల్ని కరోనా ఎత్తిచూపింది. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నంత మాత్రాన ఇది ముగిసినట్లు కాదని, మరో వేరియెంట్.. మరో వేవ్ వచ్చే ముప్పును కొట్టిపారేయలేమని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-03-02T20:35:23+05:30 IST