రెండేళ్ల కష్టాన్ని 2022 మరిపిస్తుందా?

ABN , First Publish Date - 2022-01-30T05:30:00+05:30 IST

కరోనా బాలీవుడ్‌ అభిమానులకు గత రెండేళ్లు నిరాశనే మిగిల్చింది. చెప్పుకోదగ్గ హిట్లు లేక పరిశ్రమ డీలా పడిపోయింది. కొత్త ఏడాది ఆరంభంలో కరోనా వ్యాప్తితీవ్రం అవడంతో పలు సినిమాల విడుదల మరోసారి వాయిదా పడింది. ...

రెండేళ్ల కష్టాన్ని 2022 మరిపిస్తుందా?

కరోనా బాలీవుడ్‌ అభిమానులకు గత రెండేళ్లు నిరాశనే మిగిల్చింది. చెప్పుకోదగ్గ హిట్లు లేక పరిశ్రమ డీలా పడిపోయింది. కొత్త ఏడాది ఆరంభంలో కరోనా వ్యాప్తితీవ్రం అవడంతో పలు సినిమాల విడుదల మరోసారి వాయిదా పడింది. . అయితే నెలాఖరుకల్లా పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. గత రెండేళ్లకాలం మిగిల్చిన చేదు అనుభవాలను అధిగమించి తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా అలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. అనుకున్న విధంగా సినిమాలను థియేటర్లలో రిలీజ్‌ చేయగలమనే భరోసా ఏర్పడింది. పలువురు అగ్రతారలు తమ సినిమాలతో 2022లో అలరించనున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.


అగ్రస్థానం అక్షయ్‌దే

కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ  ‘బెల్‌బాటమ్‌’ షూటింగ్‌లో పాల్గొని ఇండస్ట్రీకి ధైర్యాన్నిచ్చారు అక్షయ్‌ కుమార్‌. కరోనా దెబ్బకు అగ్రతారల సినిమాలు ఓటీటీ బాట పట్టినా ఆయన మాత్రం తన ‘బెల్‌ బాటమ్‌’, ‘సూర్యవంశీ’ చిత్రాలను థియేటర్లలోనే  విడుదల చేశారు. ఈ ఏడాది కూడా వెండితెరపై అక్షయ్‌ తన సత్తా చూపడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కథనాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిన చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్‌’ ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో  విశ్వ సుందరి మానుషి చిల్లర్‌ కథానాయికగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు డాక్టర్‌ చంద్రప్రకాష్‌ ద్వివేది. అలాగే అక్షయ్‌కుమార్‌, కృతిసనన్‌ జంటగా నటించిన ‘బచ్చన్‌పాండే’ మార్చి 18న రానుంది. అక్షయ్‌ కొత్త అవతారం ఈ సినిమాపై అంచనాలు పెంచింది. వీటితో పాటు ‘రామ్‌సేతు’ దీపావళికి, ‘రక్షాబంధన్‌’ డిసెంబరు 24న రిలీజ్‌ కానున్నాయి. 


అలియా మ్యాజిక్‌

దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కళాఖండంగా నిలిచిపోయింది. ‘దేవదాస్‌’, ‘హమ్‌ దిల్‌ దే చుకాసనమ్‌’, ‘బ్లాక్‌’, ‘రామ్‌లీలా’, ‘పద్మావత్‌’ మచ్చుకు కొన్ని. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. బాలీవుడ్‌  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలియాభట్‌ వేశ్యగా, మాఫియా నాయకురాలిగా భిన్న ఛాయలున్న పాత్రను ఈ చిత్రంలో పోషించారు. అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్రలో కనిపిస్తారు. 


రణ్‌వీర్‌ సింగ్‌ జోర్దార్‌

బాలీవుడ్‌ యువ హీరోల్లో తనకంటూ ఓ సెపరేటు స్టైల్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో రణ్‌వీర్‌సింగ్‌. గతేడాది చివరలో ‘83’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈఏడాది ఆయన ‘జయేష్‌ బాయ్‌ జోర్దార్‌’ చిత్రంతో జోరు పెంచనున్నారు. కొత్త దర్శకుడు దివ్యాంగ్‌ ఠాకూర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షాలినీపాండే కథానాయిక. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలకానుంది. అలాగే రణ్‌వీర్‌ నటిస్తున్న మరో చిత్రం ‘సర్కస్‌’ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 25న వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కథానాయికలు. ‘సూర్యవంశీ’తో గతేడాది ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన రోహిత్‌ శె ట్టి ఈ చిత్రానికి దర్శకుడు.


రణ్‌వీర్‌ రెండు చిత్రాలు

‘సంజూ’ చిత్రంతో తనలోని అద్భుతమైన నటుణ్ణి ప్రపంచానికి పరిచయం చేశారు రణ్‌వీర్‌కపూర్‌. 2018లో ఆ చిత్రం విడుదలైంది. తర్వాత ఇప్పటిదాకా రణ్‌వీర్‌కపూర్‌ నటించిన మరో చిత్రం ఏదీ  రిలీజ్‌ కాలేదు. ఇప్పటిదాకా నటనా ప్రాధాన్య చిత్రాలు, ప్రేమకథా చిత్రాలకు ఆయన పెద్ద పీట వేశారు. ఇప్పుడు వాటికి భిన్నంగా పూర్తి వాణిజ్య హంగులతో ఆయన  చేస్తున్న తాజా చిత్రం ‘షంషేరా’. ఇదొక డెకాయిట్‌ డ్రామా. సంజయ్‌దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. మార్చి 18న  విడుదలకానుంది. కరణ్‌ మల్హోత్రా దర్శకుడు. అలాగే రణ్‌వీర్‌ కపూర్‌ మరో చిత్రం ‘బ్రహ్మాస్త్ర’పై భారీ అంచనాలు ఉన్నాయి. అలియాభట్‌ కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున  కీలకపాత్రలు పోషించారు. 


ఇండియన్‌ స్ర్కీన్‌పై  కొత్త జానర్‌

హాలీవుడ్‌లో తోడేళ్లు చుట్టూ తిరిగే కథలతో పలు చిత్రాలు వచ్చి విజయవంతం అయ్యాయి. ఇలాంటి కథతో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం ‘భేడియా’. ఇందులో వరుణ్‌ ధావన్‌ సగం మనిషి,  సగం తోడేలు ఆకారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. నవంబరు 25న ఈ చిత్రం విడుదలకానుంది. ‘స్త్రీ’, ‘బాలా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే వరుణ్‌ ధావన్‌, కియారా అద్వాణి జంటగా నటించిన ‘జుగ్‌ జుగ్గ్‌ జియో’ జూన్‌ 25న విడుదలకానుంది. 


గ్యాంగ్‌స్టర్‌ హృతిక్‌

‘సూపర్‌ 30’, ‘వార్‌’ చిత్రాలతో 2019లో వరుస హిట్లు ఇచ్చారు హృతిక్‌రోషన్‌. ఆయన తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘విక్రమ్‌ వేదా’ రీమేక్‌లో నటిస్తున్నారు. సెప్టెంబరు 30న విడుదలకానుంది. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు. 

 

ఖాన్‌ త్రయం హిట్‌ కొట్టేనా?

బాలీవుడ్‌ వెండితెరపై ఖాన్‌ త్రయానిది చెరగని ముద్ర. అయితే కొన్నేళ్లుగా ఆ కోటకు బీటలు పడుతున్నాయి. వరుస పరాజయాలతో సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌లు సతమతమవుతున్నారు. ఒకవైపు కొన్ని దక్షిణాది సినిమాలు హిందీలోనూ సత్తా చాటుతుండగా ఖాన్‌ త్రయం మాత్రం బాక్సాఫీసు దగ్గర చేదు అనుభవాలను మూటగట్టుకొంటోంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌లు ఇచ్చేందుకు ఈ ముగ్గురు ఖాన్‌లు సిద్ధమవుతున్నారు. 2018లో వచ్చిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ పరాజయం తర్వాత ఆమిర్‌ఖాన్‌ చేస్తున్న చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. మూడేళ్లపాటు చిత్రీకరణ జరిగింది. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’కి ఇది రీమేక్‌. కరీనాకపూర్‌ కథానాయిక. 


 బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌ పాపులారిటీ, టాలెంట్‌కి తిరుగులేదు. కానీ 2018లో ఆయన నటించిన ‘జీరో’ చిత్రం పరాజయం ఆ  ఇమేజ్‌కు భారీ డ్యామేజి చేసింది. దాంతో ఎలాగైనా హిట్‌తో సత్తాచాటాలనే కసితో బాద్‌షా ఉన్నారు.  అందుకే బాగా అచ్చొచ్చిన యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఆయన ‘పఠాన్‌’ చిత్రం చేస్తున్నారు. ఈ గ్లోబల్‌ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌లో దీపికా పడుకోన్‌ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 


  బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ విజయాలకు కొన్ని దశాబ్దాలపాటు చుక్కానిలా నిలిచారు సల్మాన్‌. కాకపోతే  గతేడాది వచ్చిన ‘రాధే’, ‘అంతిమ్‌’ చిత్రాల వల్ల  పరాజయ భారం మోయాల్సి వచ్చింది. ఆ ఫెయిల్యూర్‌ను మరిపించే హిట్‌ కోసం సల్మాన్‌ ‘టైగర్‌ 3’తో డిసెంబరులో అభిమానుల ముందుకొస్తున్నారు. కట్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మి విలన్‌ రోల్‌ చేస్తున్నారు. 


వీటిపైనే ప్రేక్షకుల చూపు

2007లో వచ్చిన హారర్‌ కామెడీ ‘భూల్‌ భూలయ్య’కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘భూల్‌ భూలయ్య 2’. కార్తిక్‌ ఆర్యన్‌, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. టబు కీలకపాత్రలో నటి స్తున్నారు. ఆయుష్మాన్‌ ఖురానా నటిస్తున్న ‘అనేక్‌’, ‘డాక్టర్‌ జి’పై కూడా అంచనాలున్నాయి. ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా పరిచయం అవుతున్న ‘మహారాజా’ చిత్రం ఈ ఏడాది మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఆయుష్మాన్‌ ఖురానా ‘యాక్షన్‌ హీరో’పై కూడా ప్రేక్షకుల చూపు ఉంది.


రాముడిగా,  రాధేశ్యాముడిగా

‘బాహుబలి’ సిరీస్‌తో పాన్‌ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారారు ప్రభాస్‌. ఆయన రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అలాగే చాలాకాలం తర్వాత ఆయన చేస్తున్న లవ్‌స్టోరి ‘రాధేశ్యామ్‌’ చిత్రంపై కూడా  ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఈ ఏడాది ఈ రెండు చిత్రాలతో అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌ ఇస్తున్నారు ప్రభాస్‌.

Updated Date - 2022-01-30T05:30:00+05:30 IST