కొవిడ్‌కు రెండేళ్లు

ABN , First Publish Date - 2022-01-31T07:45:45+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన.. ప్రజలను తీవ్ర మానసిక సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించి రెండేళ్లు పూర్తయ్యాయి....

కొవిడ్‌కు రెండేళ్లు

దేశంలోకి మహమ్మారి ప్రవేశించి రెండేళ్లు పూర్తి

4 కోట్లకు పైగా కేసులు.. 5 లక్షల మంది మృతి..!

ఇప్పటివరకు ఏడు వేరియంట్లు.. మూడు వేవ్‌లు

ఏడాదిగా టీకాలు; 165కోట్ల డోసుల పంపిణీ

టీకా, నిబంధనల పాటింపే ప్రధాన ఆయుధాలు

2.34 లక్షల కొత్త కేసులు; 893 మరణాలు 


న్యూఢిల్లీ, జనవరి 30: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన.. ప్రజలను తీవ్ర మానసిక సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 4.11 కోట్ల కేసులు నమోదయ్యాయి. 4.95 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మూడు వేవ్‌లలో ఏడు వేరియంట్లు (ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, బి.1.617.1, బి.1.617.3, ఒమైక్రాన్‌) వెలుగుచూశాయి. వీటిలో డెల్టా సెకండ్‌ వేవ్‌కు కారణమై మూడు లక్షల పైగా ప్రాణాలు తీసింది. ఒమైక్రాన్‌తో ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌ సాగుతోంది. వ్యాప్తి రీత్యా వేగవంతమైన ఈ వేరియంట్‌ కారణంగా కేసులు భారీగానే వస్తున్నా.. తీవ్రత లేకపోవడంతో ప్రాణాపాయం తక్కువే ఉంటోంది. కాగా, గతేడాది జనవరి 16 నుంచి దేశంలో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది.


ఇప్పటివరకు 165 కోట్ల మందికి కనీసం ఒక డోసు టీకా పంపిణీ చేశారు. మరోవైపు ఇప్పటికీ మహమ్మారికి ముగింపు ఎప్పుడనేది మాత్రం తేలలేదు. ఈ నేపథ్యంలో జాగ్రత్తల పాటింపు, టీకా పొందడమే ప్రస్తుతానికి కొవిడ్‌ నిరోధానికి ఉన్న మేలైన మార్గాలని ప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘మనమిప్పుడు మహమ్మారి మధ్య దశలో ఉన్నాం. వ్యాప్తికి అడ్డుకట్ట  వేయడం, ప్రజల ప్రాణాలు కాపాడడంపై దృష్టిసారించాలి. కొవిడ్‌ ఎండెమిక్‌ దశకు చేరినా.. వైరస్‌ ఇక ఎటువంటి ముప్పునూ కలిగించదని భావించలేం’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ పేర్కొనడమే దీనికి నిదర్శనం. కాగా, దేశంలో శనివారం 2.34 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 893 మరణాలు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేరళవే 413 మరణాలున్నాయి. కర్ణాటకలో 70 మంది, మహారాష్ట్రలో 61 మంది, తమిళనాడులో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, శనివారం 3.50 లక్షల మంది కోలుకున్నారు. 75 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. దీనిని ప్రధాని మోదీ  ట్యాగ్‌ చేస్తూ, టీకా పొంది ఈ ఘనతలో భాగమైనవారికి అభినందనలు తెలిపారు. 


కోలుకున్న లతా మంగేష్కర్‌

సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌ కొవిడ్‌, న్యుమోనియా నుంచి కోలకున్నట్లు మహారాష్ట్ర మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో  నెల రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమెకు ఆదివారం వెంటిలేటర్‌ తొలగించారు.


రష్యాలో రికార్డు స్థాయి కేసులు

ఒమైక్రాన్‌తో రష్యాలో రికార్డు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఎన్నడూ లేనంతగా 1.21 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే దేశంలో కేసులు 8 రెట్లు పెరిగాయి. కాగా, ముప్పు ఎక్కువగా ఉన్న 5-11 ఏళ్ల పిల్లలకు టీకా ఇవ్వాలని యూకే నిర్ణయించింది.

Updated Date - 2022-01-31T07:45:45+05:30 IST