ప్రతీకాత్మక చిత్రం
ఒక భార్య, ఒక భర్త ఉన్నఇంట్లోనే తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకరు చేసే పనులు ఇంకొకరికి నచ్చకపోవడం, చిన్న చిన్న తప్పులను పెద్దవి చేసుకోవడం.. తదితర కారణాలతో సంసారాన్ని సమస్యలకు నిలయంగా మార్చుకుంటూ ఉంటారు. అలాంటిది ఇద్దరు భార్యలు ఉన్న కుటుంబంలో ఇంకెన్ని సమస్యలు ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిందితుడు ఉజ్వల్ తన మొదటి భార్యను కాదని.. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలనూ ఒకే ఇంట్లో ఉంచాడు. అయితే ఈ క్రమంలో రాత్రి ఎవరి వద్ద ఉండాలనే విషయంలో గొడవ జరిగింది. చివరికి అతను మొదటి భార్య పట్ల ప్రవర్తించిన తీరు.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పఖంజూర్ పరిధి కపాసి అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉజ్వల్ మండల్, సవిత మండల్ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. మొదటి నుంచీ వీరి సంసారం.. ఎలాంటి సమస్యలు లేకుండా సవ్యంగా సాగుతోంది. అయితే రెండేళ్ల క్రితం ఉజ్వల్‌కు మహారాష్ట్రకు చెందిన జెబా మండల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. తర్వాత ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తన తల్లికి, మొదటి భార్యకు నచ్చజెప్పి.. రెండో భార్యను కూడా ఇంట్లోనే ఉంచాడు.
ఇద్దరు భార్యల మధ్య కొన్నాళ్లు ఎలాంటి సమస్యలూ లేవు. అయితే మార్చి 28న రాత్రి అసలు సమస్య మొదలైంది. ఆ రోజు రాత్రి భర్త బెడ్రూంలో మొదటి భార్య సవిత ఉండగా.. రెండో భార్య జెబా లోపలికి వెళ్లింది. ‘‘ఈ రోజు ఉజ్వల్ గదిలో నేను పడుకుంటాను.. నువ్వు బయటికి వెళ్లు’’ అని సవితతో అనగానే గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తుండగా.. వారి అత్త అక్కడికి వచ్చి ఇద్దరినీ మందలించింది. తర్వాత భర్త అక్కడికి వచ్చి మొదటి భార్యను మందలించాడు. ఈ క్రమంలో రెండో భార్యతో కలిసి సవితను పట్టుకుని, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న చెరువులో దూకింది. స్థానికులు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సవిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న ఉజ్వల్, జెబా కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
ఇవి కూడా చదవండి