గుంటూరు మీదగా రెండు రైళ్లు

ABN , First Publish Date - 2020-05-22T09:22:44+05:30 IST

జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత తొలి రైలు జూన్‌ ఒకటో తేదీన గుంటూరుకు

గుంటూరు మీదగా రెండు రైళ్లు

ఒకటో తేదీ నుంచి రోజూ రాకపోకలు

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్ల బుకింగ్‌కు అవకాశం 

ప్రతీ ప్రయాణికుడు రెండు గంటల ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి


గుంటూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత తొలి రైలు జూన్‌ ఒకటో తేదీన గుంటూరుకు చేరుకోనుంది. సికింద్రాబాద్‌ - గుంటూరు - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు(గోల్కొండ రైలు సమయం), సికింద్రాబాద్‌ - హౌరా - సికింద్రాబాద్‌ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ టైం) మధ్య మరో రైలుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు డైలీ సర్వీసుగా నడపనున్నట్లు సీపీఆర్‌వో రాకేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07202 సికింద్రాబాద్‌ - గుంటూరు ప్రత్యేక రైలు జూన్‌ ఒకటి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు గుంటూరుకు చేరుకొంటుంది. జిల్లాలో పెదకాకాని, నంబూరు, మంగళగిరి, కృష్ణాకెనాల్‌లో నిలుపుదల ఉంటుంది. ఈ రైలు ద్వారా విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. నెంబరు. 07201 గుంటూరు - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు జూన్‌ ఒకటో తేదీ నుంచి నిత్యం ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది.


ఈ రైలులో సెకండ్‌ సిట్టింగ్‌, ఏసీ చైర్‌కార్‌ బోగీలు మాత్రమే ఉంటాయి.   నెంబరు. 02704 సికింద్రాబాద్‌ - హౌరా(ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ టైంటేబుల్‌) జూన్‌ ఒకటో తేదీన మధ్యాహ్నం 3.55 గంటల నుంచి నిత్యం బయలుదేరుతుంది. ఈ రైలుకు గుంటూరులో పిడుగురాళ్ల, గుంటూరు రైల్వే జంక్షన్‌లో నిలుపుదల సౌకర్యం ఉంది. స్లీపర్‌, త్రీటైర్‌, టూటైర్‌, ఫస్టు ఏసీ టిక్కెట్ల రిజర్వేషన్‌ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్‌ అయిపోయి వెయిటింగ్‌లిస్టులోకి వెళ్లిపోయింది.


నెంబరు. 02703 హౌరా - సికింద్రాబాద్‌(ఫలక్‌నుమా సమయ పట్టిక) ఈ నెల 3న గుంటూరు మీదగా సికింద్రాబాద్‌కు చేరుకొంటుంది. టిక్కెట్‌లు వెయిటింగ్‌లిస్టులో జారీ చేసినప్పటికీ అవి కన్‌ఫర్మ్‌ అయితేనే రైల్వేస్టేషన్‌లోకి అనుమతిస్తారు. ఈ రైళ్లలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ కోటా ఉండదు. జనరల్‌ బోగీలు కూడా ఉండవు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/మొబైల్‌యాప్‌ ద్వారా మాత్రమే టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, సుప్రీం కోర్టు/హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పీఆర్‌ఎస్‌ కౌంటర్ల ద్వారా టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవాలి.


సిట్టింగ్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, స్వాతంత్య్ర సమరయోధులు, పూర్తి రీయింబర్స్‌మెంట్‌ అయ్యే రైల్వే వారంట్‌లు/వోచర్లు, దివ్యాంగులు, మరో 11 రకాల రోగులు, విద్యార్థులు మాత్రం రైల్వే పీఆర్‌ఎస్‌ కౌంటర్లకు వెళ్లి టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాదారణ ప్రయాణీకులను పీఆర్‌ఎస్‌ కౌంటర్ల వద్దకు అనుమతించరు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌లిస్టులో టిక్కెట్‌లు జారీ చేసినప్పటికీ కన్‌ఫర్మ్‌ అయితేనే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. 30 రోజులు ముందుగా అడ్వాన్స్‌ టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రతీ ప్రయాణికుడు రెండు గంటల ముందుగా రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి. వారికి స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేస్తారు. కోవిడ్‌-19 లక్షణాలు లేకపోతేనే అనుమతిస్తారు. గమ్యస్థానం చేరుకొన్న తర్వాత అక్కడి జిల్లా యంత్రాంగం అమలు చేస్తోన్న కొవిడ్‌-19 ప్రొటోకాల్స్‌ని పాటించాలి. 

Updated Date - 2020-05-22T09:22:44+05:30 IST