ఎల్ఓసీ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2020-07-11T21:29:48+05:30 IST

నియంత్రణ రేఖ వద్ద నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన..

ఎల్ఓసీ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. జమ్ము-కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు కేవలం 100మీ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఎల్‌ఓసీకి దగ్గరగా కదలికలు కనిపించడంతో సైన్యం అప్రమత్తమయింది. వెంటనే వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా అటు నుంచి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం కూడా ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ఓ సైనికాధికారి ప్రవటించారు. మరణించిన ఇద్దరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారి వద్దనుంచి ఏకే-47 రైఫిళ్ళు, వందల సంఖ్యలో బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 4 పాకిస్తాన్ తయారీ గ్రనేడ్‌లు, ఓ చైనా తయారీ పిస్టల్‌‌ను కూడా చేజిక్కించుకున్నారు. ఇదిలా ఉంటే మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు కుప్వారాలోని హంద్వారా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల హిద్రీస్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. జమ్ము-కాశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 తొలగించి ఏడాది పూర్తైన సందర్బంగా అల్లర్లు సృష్టించడమే వీరి లక్షంగా తెలుస్తోందని సైన్యం పేర్కొంది. వీరిద్దరు లష్కరే తోయిబాకు చెందినవారుగా భావిస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2020-07-11T21:29:48+05:30 IST