కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరికి విముక్తి : Haryana Police

ABN , First Publish Date - 2022-07-10T17:14:16+05:30 IST

కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరికి విముక్తి కల్పించినట్లు హర్యానా పోలీసులు

కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరికి విముక్తి : Haryana Police

చండీగఢ్ : కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరికి విముక్తి కల్పించినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారని, ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, హర్యానా పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో బాధితులకు విముక్తి కల్పించినట్లు వివరించారు. 


STF విడుదల చేసిన ప్రకటనలో, తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న శ్రీ జయకృష్ణ టెక్స్‌టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విల్వపతి (56), ఈ కంపెనీ అకౌంట్స్ మేనేజర్‌ వినోత్ కుమార్ (28)లను దేశ రాజధాని నగరం ఢిల్లీలో కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఆసిఫ్ హుస్సేన్, మహమ్మద్ కరీం, కే జీర్వానీ బాబు, మహమ్మద్ ఆజాద్, సోనూలను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఆసిఫ్ హుస్సేన్, మహమ్మద్ కరీం పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని తెలిపింది. మిగిలిన ముగ్గురూ ఢిల్లీవాసులని తెలిపింది. 


భారీ యార్న్ డెలివరీ కాంట్రాక్టు ఇస్తామనే సాకుతో విల్వపతి, వినోత్‌లను ఈ నిందితులు ప్రలోభపెట్టి, ముడి సరుకుల నమూనాలను తీసుకురావాలని కోరినట్లు తెలిపింది. వీరిద్దరూ వచ్చిన వెంటనే నిందితులు కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. బాధితుల కుటుంబ సభ్యులకు నిందితులు ఫోన్ చేసి, తాము వీరిని వదిలిపెట్టాలంటే,  రూ.50 లక్షలు నగదు చెల్లించాలని బెదిరించారని తెలిపింది. డబ్బు ఇవ్వకపోతే వీరిద్దరినీ చంపేస్తామని బెదిరించారని పేర్కొంది. 


తమిళనాడులోని దిండిగల్‌, తాడికొంబు పోలీస్ స్టేషన్‌లో జూలై 8న కేసు నమోదైందని తెలిపింది. ఈ సమాచారం అందుకున్న హర్యానా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాపర్లను గుర్తించి, ఢిల్లీలోని విష్ణు గార్డెన్‌లో నిర్బంధంలో ఉన్న బాధితులిద్దరికీ విముక్తి కల్పించారు. 


Updated Date - 2022-07-10T17:14:16+05:30 IST