ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2022-01-24T05:38:12+05:30 IST

ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలను బలి తీసుకుంది. సెలవు దినాన్ని సరదాగా గడపాలనుకున్న వారిని చివరకు మృత్యుఒడికి చేర్చింది.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
గుంటూరు ఛానల్‌, అంతరచిత్రంలో బాలుర మృతదేహాలు

పాతమంగళగిరిలో విషాదం

మంగళగిరి, జనవరి 23: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలను బలి తీసుకుంది. సెలవు దినాన్ని సరదాగా గడపాలనుకున్న వారిని చివరకు మృత్యుఒడికి చేర్చింది. ఈ ఘటన పాతమంగళగిరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలిలా ఉన్నాయి.. పాతమంగళగిరి దిగుడబావి సెంటరుకు చెందిన షేక్‌ అహ్మల్‌(12), షేక్‌ మస్తాన్‌(14) ఇరుగు పొరుగు కుటుంబాలకు చెందినవారు. అహ్మల్‌ పెదవడ్లపూడి విజేత స్కూల్‌లో ఆరో తరగతి, మస్తాన్‌ మునిసిపల్‌ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇరుగు పొరుగు కుటుంబాలు కావడంతో వీరిద్దరు స్నేహంగా ఉండేవారు. ఆదివారం సెలవుదినం కావడంతో స్నేహితులిద్దరూ ఈత కొట్టేందుకు ఉదయం 11గంటలకు గుంటూరు ఛానల్‌ వద్దకు వెళ్లారు. ఈతకు దిగిన వారు నీటి ప్రవాహ ఉధృతిని తట్టుకోలేక ఛానల్‌లో కొట్టుకుపోయారు. మధ్యాహ్న సమయానికి కూడా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గుంటూరు ఛానల్‌ వద్దకు వచ్చి చూడగా కాలువగట్టుపై వారి చెప్పులు కనిపించాయి. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ జె.రాంబాబు, అర్బన్‌ సీఐ బి.అంకమ్మరావు హుటాహుటిన తమ సిబ్బందితో వచ్చి ఈతగాళ్ల సాయంతో ఛానల్‌లో గాలింపు చేపట్టారు. సంఘటనాస్థలికి సమీపంలో ఛానల్‌లో ఏపుగా పెరిగిన జూట్‌ గడ్డి మధ్య బాలుర మృతదేహాలు ఇరుక్కుపోయి ఉండగా వాటిని వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. 

 

Updated Date - 2022-01-24T05:38:12+05:30 IST