Abn logo
May 15 2020 @ 19:07PM

‘ఆచార్య’ తర్వాత చిరు చేసే రెండు చిత్రాల స్ర్కిప్ట్స్ రెడీ

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస చిత్రాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ చిత్రం తర్వాత ఏయే డైరెక్టర్స్‌తో సినిమాలు ఉంటాయో తెలిపారు. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగిపోయింది. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్ తీసేస్తారా? షూట్‌కి వెళ్లాలా అని చిత్రయూనిట్ చూస్తుంది. ఇక ఆ సినిమా సంగతి పక్కన పెడితే, ‘ఆచార్య’ తర్వాత చిరు చేయబోయే రెండు చిత్రాలకు స్క్రిప్ట్‌లు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. 


ఇటీవల చిరంజీవి తెలిపినట్లుగానే ‘లూసిఫర్’ రీమేక్ స్ర్కిప్ట్‌ను చిరుకి అనుగుణంగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ మార్పులు చేయడం పూర్తయిందని, త్వరలోనే ఈ చిత్ర ప్రకటన అధికారికంగా రానుందని అంటున్నారు. ‘లూసిఫర్’ రీమేక్‌ని సుజీత్ మలిచిన తీరు చిరు, చరణ్‌లకు నచ్చడంతో ‘ఆచార్య’ పూర్తవ్వగానే షూటింగ్ కూడా ప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రమే కాకుండా మరో యంగ్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కూడా చిరంజీవి కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడని, మెగాస్టార్‌కి కూడా వినిపించాడని అంటున్నారు. 


ఈ స్ర్కిప్ట్ విన్న చిరు, డైరెక్టర్ బాబీని అభినందించడమే కాకుండా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత సినిమా మొదలెడదాం అని హామీ కూడా ఇచ్చారట. ఈ రెండు చిత్రాలే కాకుండా మెహర్ రమేష్, హరీష్ శంకర్, సంపత్ నంది వంటి వారు కూడా చిరు కోసం స్ర్కిప్ట్‌లు రెడీ చేసే పనిలో ఉన్నారు. అలాగే చిరుతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కూడా ఈ లాక్‌డౌన్‌లో చిరు కోసం ఓ స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ‘ఆచార్య’ తర్వాత చిరు చేసే చిత్రాల గురించి అఫీషియల్ ప్రకటన ఈ లాక్‌డౌన్ అనంతరం వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement