రెండు ఆర్టీసీ బస్సుల ఢీ

ABN , First Publish Date - 2021-01-14T07:44:25+05:30 IST

సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన వేళ.. రోడ్డు ప్రమాదం సంభవించి 24 మందిని ఆస్పత్రిపాలు చేసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌ గ్రామ శివారులో బుధవారం రెండు ఆర్టీసీ బస్సులు

రెండు ఆర్టీసీ బస్సుల ఢీ

డ్రైవర్లు, కండక్టర్లు సహా 24 మందికి గాయాలు

వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రమాదం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో ఘటన


ఎల్కతుర్తి, జనవరి 13: సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన వేళ.. రోడ్డు ప్రమాదం సంభవించి 24 మందిని ఆస్పత్రిపాలు చేసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌ గ్రామ శివారులో బుధవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా, రెండు బస్సుల కండక్టర్లు, 20 మంది ప్రయాణికులూ గాయపడ్డారు. వీరందరికీ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌-1 డిపోకు చెందిన టీఎ్‌స03యూబీ 1044 నంబరు గల బస్సుతో వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం కౌకొండ గ్రామానికి చెందిన డ్రైవర్‌ చుక్క రాజేష్‌.. వరంగల్‌ నుంచి 50 మంది ప్రయాణికులతో నిజామాబాద్‌కు బయలుదేరాడు. మరోవైపు కరీంనగర్‌-1 డిపోకు చెందిన టీఎస్‌ 02యూసీ 6009 నంబరు గల బస్సుతో అదే జిల్లా గన్నేవరం మండలం పరువెల్ల గ్రామానికి చెందిన లింగంపల్లి ప్రశాంత్‌ కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు 48 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. కాగా, రెండు బస్సులు రెండు వైపుల నుంచి వల్బాపూర్‌ గ్రామ శివారులోకి రాగానే.. ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్మసీ కళాశాల సమీపంలోని మలుపు వద్ద వరంగల్‌ డిపో బస్సు.. ముందు వెళ్తుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న కరీంనగర్‌ డిపో బస్సును వేగంగా ఢీ కొట్టింది.


దీంతో రెండు బస్సుల్లోని డ్రైవర్లకు తీవ్ర గాయాలై వారి సీట్లలోనే చిక్కుకుపోయారు. వరంగల్‌-1 డిపో కండక్టర్‌, హన్మకొండకు చెందిన కొండూరు నర్సింహారెడ్డి, కరీంగనర్‌ -1 డిపో కండక్టర్‌, కరీంనగర్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన బూట్ల సత్తయ్యతోపాటు 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్తులు కలిసి క్షతగాత్రులను బస్సుల్లో నుంచి కిందకు దింపారు. తీవ్రంగా గాయపడినవారిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్‌ డిపో కండక్టర్‌ బూట్ల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివా్‌సజీ తెలిపారు.ప్రమాదంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన రమే్‌షశెట్టి హైందవి, రమే్‌షశెట్టి అనూష, నల్లగోని నవీన్‌, అదే మండలం భీంపల్లి గ్రామానికి చెందిన బండ రాకేష్‌, కాజీపేట దర్గాకు చెందిన బానుక వెంకన్నయాదవ్‌, బానుక అనిత, బానుక సిరి, కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కలకు చెందిన యాసర్ల అజయ్‌, టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన నాగుల శిరీష, హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన రాజయ్య, రాజమ్మ, సైదాపూర్‌ మండలానికి చెందిన సంపూర్ణ, జమ్మికుంటకు చెందిన ఎండీ సిద్దిక్‌, హన్మకొండకు చెందిన ఉయ్యూరి రత్నకుమారి, కాజీపేటకు చెందిన ఎండీ ఇబ్రహీం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన ఎండీ అల్లావుద్దీన్‌, ఎండీ సఫ్రీనా ఖతూర్‌, గోదావరిఖనికి చెందిన ఎండీ అంకుషా వలీకి గాయాలయ్యాయి.

Updated Date - 2021-01-14T07:44:25+05:30 IST