HYD : నేను గొప్ప.. అంటే నేనే గొప్పంటూ మత్తులో వాదులాట.. చివరికి ఊహించని విధంగా...!

ABN , First Publish Date - 2021-07-18T17:50:28+05:30 IST

‘నేను గొప్ప అంటే.. నేను గొప్ప’ అని వాదులాడుకున్నారు. తాగిన మైకంలో ఇద్దరూ....

HYD : నేను గొప్ప.. అంటే నేనే గొప్పంటూ మత్తులో వాదులాట.. చివరికి ఊహించని విధంగా...!

  • తాగిన మైకంలో హత్య
  • రౌడీ షీటర్‌ను చంపిన మరో రౌడీ 
  • మాటా మాటా పెరిగి దాడి

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : వారిద్దరూ రౌడీషీటర్లు.. స్నేహితులు కూడా. రోజూ ఇద్దరు కలిసి తిరిగే వారు. జల్సాలు, దౌర్జన్యాలు షరామామూలే. ఆ ఇద్దరూ మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. ఇంతలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ‘నేను గొప్ప అంటే.. నేను గొప్ప’ అని వాదులాడుకున్నారు. తాగిన మైకంలో ఇద్దరూ ఘర్షణ పడగా, ఒకరిని మరొకరు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన  శుక్రవారం అర్ధరాత్రి ఓల్డ్‌ మలక్‌పేటలో జరిగింది. చాదర్‌ఘాట్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాలు.. ఓల్డ్‌మలక్‌పేట వాహెద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ముస్తాక్‌ ఉద్దీన్‌ అలియాస్‌ ముస్తాక్‌ డాన్‌(33) చాదర్‌ఘాట్‌ పీఎస్‌లో రౌడీ షీటర్‌. రెండేళ్ల క్రితం ముస్తాక్‌ తన నివాసాన్ని హుమాయున్‌ నగర్‌కు మార్చడంతో సంవత్సరం క్రితం రౌడీషీట్‌నూ హుమాయూన్‌నగర్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. చాదర్‌ఘాట్‌ పీఎస్‌లోని మరో రౌడీ షీటర్‌ మహమూద్‌, ముస్తాక్‌లు స్నేహితులు. హుమాయున్‌నగర్‌ నుంచి ముస్తాక్‌ రోజూ ఓల్డ్‌మలక్‌పేటలోని వాహెద్‌నగర్‌కు వచ్చి వెళ్తుంటాడు.


శుక్రవారం అర్ధరాత్రి కూడా ముస్తాక్‌, మహమూద్‌తోపాటు మరో ఇద్దరు మద్యం తాగారు. ఈ క్రమంలో ముస్తాక్‌, మహమూద్‌ల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో మహమూద్‌ తన వద్ద ఉన్న కత్తితో ముస్తాక్‌ను మూడు చోట్ల పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ముస్తాక్‌ అక్క డికక్కడే మృతి చెందాడు. తర్వాత అందరూ పారిపోయారు. అయితే, వీరిలో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. చాదర్‌ఘా ట్‌ పోలీసులు హుటాహుటిన చేరుకుని ముస్తాక్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తూర్పు మండలం డీసీపీ రమేష్‌, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌‌లు చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ నుంచి వివరాలు తెలుసు కున్నారు. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించారు. కేసును చాదర్‌ఘాట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ముస్తాక్‌పై 33 కేసులు 

హత్యకు గురైన రౌడీషీటర్‌ ముస్తాక్‌పై 33 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో 26 కేసులు నమోదు కాగా, ఏడు కేసులు నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యాయి. ముస్తాక్‌పై పదేళ్లుగా చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదు అయి ఉంది.  

Updated Date - 2021-07-18T17:50:28+05:30 IST