చంపింది కిరాయి హంతకులే!

ABN , First Publish Date - 2022-03-03T07:42:13+05:30 IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ ప్రాంతంలో ఇద్దరు రియల్టర్లను కాల్చి చంపింది కిరాయి హంతకులేనని..

చంపింది కిరాయి హంతకులే!

  • సుపారీ గ్యాంగ్‌తోనే రియల్టర్ల హత్య.. 
  • తుపాకీ పేల్చడంలో ఆరితేరిన గ్యాంగ్‌
  • ఎస్‌వోటీ పోలీసుల అదుపులో నిందితులు?
  • తనకు సంబంధం లేదంటున్న మట్టారెడ్డి
  • హత్య చేసేందుకు 15 రోజులుగా రెక్కీ?
  • సుపారీపై పోలీసుల ఆరా
    నేడో రేపో నిందితుల వివరాల వెల్లడి

హైదరాబాద్‌ సిటీ/రంగారెడ్డి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ ప్రాంతంలో ఇద్దరు రియల్టర్లను కాల్చి చంపింది కిరాయి హంతకులేనని తెలుస్తోంది. ఘటనలో పాల్గొన్న ముగ్గురు దుండగులు ఎస్‌వోటీ పోలీసులకు చిక్కినట్లు, వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం దుండగుల కాల్పుల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నవారు శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి మృతి చెందడం తెలిసిందే. కాగా, ఈ కేసును రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌వోటీ, సీసీఎస్‌, క్రైమ్‌ టీమ్‌తోపాటు మొత్తం 8 ప్రత్యేక పోలీస్‌ బృందాలను రంగంలోకి దింపి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు దుండగులు చిక్కినట్లు సమాచారం. అయితే మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నందున.. వీరి వివరాలను పోలీసులు వెల్లడించడంలేదు. కానీ, కిరాయి హంతకులే రియల్టర్లను హతమార్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితులు సుపారీ తీసుకున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో సుపారీ ఎవరిచ్చారు? ఎంత ఇచ్చారు? వారిని చంపడానికి బలమైన కారణాలేంటి? అనేదానిపై ఎస్‌వోటీ పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులు అంతర్రాష్ట్ర ముఠాగా తొలుత అనుమానించినా.. లోకల్‌ గ్యాంగ్‌కు చెందినవారేనన్న సమాచారం వస్తోంది. నిందితుల నుంచి ఒక కారు, రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.


రియల్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలకు చాలా మందితో విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వివాదాస్పద భూములు కొనుగోలు చేసి, వాటిని క్లియర్‌ చేసుకునే క్రమంలో జరిగిన గొడవలు, కొట్లాటల కారణంగా వారికి ప్రత్యర్థులు ఎక్కువ మందే ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలోనూ వీరిపై పలు కేసులున్నాయి. రాఘవేందర్‌రెడ్డి గతంలో జరిగిన హత్య కేసుల్లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించి రెండేళ్ల క్రితం బయటకు వచ్చాడు. వివాదాస్పద భూములు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరకు అమ్మే క్రమంలో శ్రీనివా్‌సరెడ్డి అతి తక్కువ సమయంలోనే పెద్ద  రియల్టర్‌గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో తనకు శత్రువులు పెరిగిన విషయాన్ని గుర్తించి ఎప్పుడూ పది మంది యువకులను వెంటేసుకొని తిరిగేవాడు. కాల్పులు జరిగిన రోజు శివరాత్రి పండుగ కావడంతో అతని వెంట గ్యాంగ్‌ సభ్యులెవరూ వెళ్లలేదు. కానీ, దుండగులు అప్పటికే పదిహేను రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నట్లు, అదును చూసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితులు పథకం ప్రకారమే కర్ణంగూడ ప్రాంతాన్ని ఎంచుకొని శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలను హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసుల దృష్టి మళ్లించడానికే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు విచారణలో తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రీనివా్‌సరెడ్డి సెటిల్‌ చేసిన భూ దందాలు, ఎవరెవరితో గొడవలు ఉన్నాయి? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న మట్టారెడ్డిని పోలీసులు విచారించగా.. హత్యలతో తనకు సంబంధంలేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తి చేసి ఒకటి రెండు రోజుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 


దన్నుగా నిలిచిన సాంకేతికత.. 

కాల్పులకు పాల్పడిన దుండగులను గుర్తించడంలో సాంకేతికత దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది. రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన టీమ్‌.. టవర్‌డంప్‌ తీసి వేల సంఖ్యలో సీడీఆర్‌లను వడపోసింది. ఘటనా స్థలానికి వెళ్లే అన్ని మార్గాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. డాగ్‌స్క్వాడ్‌ వెళ్లిన మార్గంలో నిందితులకు సంబంధించిన కీలక సమాచారం దొరికినట్లు సమాచారం. క్లూస్‌ టీమ్‌ సేకరించిన సమాచారాన్ని, కాల్పులు జరిగిన ప్రాంతంలో దొరికిన ఆనవాళ్లను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపారు. జంటహత్యలకు భూవివాదాలే కారణం కావడంతో రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఖాల్సా రెవెన్యూలోని సర్వే నెం.1369, 1371, 1372 లలోని 18 ఎకరాల  పట్టా భూమిపై వివాదాలు, 20 ఏళ్ల నుంచి జరిగిన క్రయవిక్రయాల వివరాలను సేకరించారు. ప్లాట్లు.. మళ్లీ వ్యవసాయ భూములుగా ఎలా మారాయన్న దానిపై విచారించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.


హత్యల్లో ఇద్దరు షార్ప్‌ షూటర్లు?

శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డిల హత్యల్లో ఇద్దరు షార్ప్‌ షూటర్లు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రమాద ఘటనలో స్వాధీనం చేసుకున్న బుల్లెట్ల ఆధారంగా హంతకులు రెండు వేర్వేరు ఆయుధాలను వాడినట్లు తెలిసింది. కాగా, ఘటన జరిగిన సమయంలో ఈ ప్రాంతానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రెండు స్కార్పియో వాహనాలు అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పెట్రోల్‌బంక్‌లో ఉన్న సీసీ పుటేజ్‌ మొత్తాన్ని బుధవారం ఉదయం పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-03-03T07:42:13+05:30 IST