రెండు రాజ్యసభ సీట్లకు 10 మంది పోటీ

ABN , First Publish Date - 2022-05-22T15:59:08+05:30 IST

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో రెండు రాజ్యసభ సీట్ల కోసం పదిమందికిపైగా సీనియర్‌ నేతలు పట్టుబడుతుంటంతో పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక

రెండు రాజ్యసభ సీట్లకు 10 మంది పోటీ

                  - అన్నాడీఎంకేలో తేలని అభ్యర్థుల ఎంపిక


చెన్నై: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో రెండు రాజ్యసభ సీట్ల కోసం పదిమందికిపైగా సీనియర్‌ నేతలు పట్టుబడుతుంటంతో పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇలంగోవన్‌, కేఆర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌, అన్నాడీఎంకేకు చెందిన నవనీతకృష్ణన్‌, ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణ్యం, విజయకుమార్‌ రాజ్యసభ సభ్యత్వాలు త్వరలో ముగియనున్నాయి. ఖాళీపడిన ఈ ఆరు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. శాసనసభలోని మెజారిటీ ప్రకారం అధికారపక్షమైన డీఎంకే నాలుగు రాజ్యసభ స్థానాలను సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నాలుగు సీట్లలో ఒకసీటును మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కేటాయించింది. మిగిలిన మూడుస్థానాలకుగాను తంజావూరు కల్యాణసుందరం, కేఆర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌, న్యాయవాది గిరిరాజన్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే శాసనసభలో మెజారిటీ ప్రకారం రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ రెండు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైలో రెండుసార్లు పార్టీ నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. ఇద్దరు నేతలు తమ వర్గాలకు చెందిన ఇరువురిని సులువుగా ఎంపిక చేయగలమని భావించారు కానీ, పార్టీ నిర్వాహకుల సమావేశంలో పదిమందికిపైగా సీనియర్‌ నేతలు తమకు రాజ్యసభ సీట్లు కావాలని పట్టుబట్టారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రెండు సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. నామినేషన్ల గడువు ఈ నెల 31న ముగియనుంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావటానికి రెండు రోజులే మిగిలి ఉన్నా అన్నాడీఎంకేలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించలేని పరిస్థితులే కొనసాగుతున్నాయి. దక్షిణాది జిల్లాలకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఇన్బదురై, పార్టీ సీనియర్‌ నేత రాజాచెల్లప్పా తనయుడు సత్యన్‌, రామనాధపురానికి చెందిన కృత్తికా మునుసామి, రాజ్యసభ సీటు పొందటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే విధంగా తంజావూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు కూడా పావులు కదుపుతున్నారు. ఇక రాజ్యసభ సీటుకోసం మాజీ మంత్రులు కూడా బారులు తీరుతున్నారు. వీరిలో సీవీ షణ్ముగం, డి.జయకుమార్‌, గోకుల ఇందిర, సెమ్మలై, సయ్యద్‌ఖాన్‌ ఉన్నారు. ఇలా రెండు రాజ్యసభ స్థానాల కోసం పదిమందికి పైగా పోటీపడుతుండుటంతో అన్నాడీఎంకేలో అభ్యర్థులపై ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ రెండు రోజుల్లోపు అన్నాడీఎంకే అధిష్ఠానం అభ్యర్థుల ఎంపిక చేసి ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది.

Updated Date - 2022-05-22T15:59:08+05:30 IST