సమయానికి ఆదుకున్న పోలీసులు.. రోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ABN , First Publish Date - 2020-04-04T23:59:55+05:30 IST

పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు సహాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రాథమిక చికిత్స

సమయానికి ఆదుకున్న పోలీసులు.. రోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ధరమ్‌కోట్: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు సహాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రాథమిక చికిత్స కేంద్రంతో సహా ఎక్కడా కూడా ఆ మహిళను చేర్చుకోకపోవడంతో.. పోలీసులు సమయానికి ఆదుకొని ఆమెకు.. ఆమె బిడ్డకు ప్రాణాలుపోశారు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరమ్‌కోట్‌లో చోటు చేసుకుంది. 


భాయ్‌ కా ఖూన్ కాలనీలో నివాసం ఉండే జ్యోతి అనే మహిళకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ నొప్పులను భరిస్తూనే తన భర్త హర్మేశ్‌తో బైక్‌పై దాదాపు మూడు గంటల ఆస్పత్రి కోసం తిరిగింది. ఆమె బాధను పట్టుంచుకోవడం పక్కన పెడితే.. పీహెచ్‌సీ సహా వాళ్లు వెళ్లిన ఏ ఆస్పత్రి సిబ్బంది కనీసం తలుపు కూడా తీయలేదు. 


అయితే వాళ్లు వైద్య సేవ కోసం వెతుకుతుండగా.. పీసీఆర్ డ్యూటీలో ఉన్న ఏఎస్‌ఐ బిక్కార్ సింగ్, కానిస్టేబుల్ సుఖ్‌జీందర్ సింగ్ వారిని గమనించారు. సదరు మహిళ బాధను చూసి వాళ్లు చలించిపోయారు. వెంటనే బెంచీలను ఏర్పాటు చేశారు.. తమకు తెలిసిన నర్సుకు ఫోన్ చేసి అక్కడకు పిలిపించారు. ఆ పక్కనే ఉన్న మహిళలను కూడా సహాయానికి రమ్మన్నారు. దీంతో వీరందరి సహాయంతో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 


ఆ తర్వాత ఆమెను సురక్షితంగా ఇంట్లో అప్పజెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ‘‘కంగారు పడకండి. బాబుకి, తల్లికి ఎటువంటి హాని జరుగలేదు. మాకు కాదు.. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి’’ అని ఆ పోలీసులు చెప్పడం మనకు అందులో తెలుస్తోంది. 


దీనిపై ఆ మహిళ భర్త హర్మేశ్ మాట్లాడుతూ.. ‘‘ఆ పోలీసులు దేవుళ్లలా వచ్చి.. నా భార్య, బిడ్డను కాపాడారు’’ అని అన్నారు.


ఇక ఏఎస్‌ఐ బిక్కార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కర్ఫ్యూ సమయంలో ప్రతి ఒక్క వాహనాన్ని మేము పరిశీలిస్తాము. అదే సమయంలో ఆ మహిళ నొప్పులతో బాధపడుతుండటం గమనించాము. దీంతో నేను, సుఖ్‌జీందర్ వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మేము ఆస్పత్రుల కోసమో, నర్సుల కోసమో వెతుక్కుంటూ కూర్చుంటే.. ఆ మహిళ బతికేది కాదు’’ అని అన్నారు. పోలీసులు చేసిన ఈ పనికి సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

Updated Date - 2020-04-04T23:59:55+05:30 IST