కరోనా ఇద్దరు ‘గీతం’ ప్రొఫెసర్లు మృతి

ABN , First Publish Date - 2021-05-07T05:22:57+05:30 IST

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కొవిడ్‌తో కన్నుమూశారు.

కరోనా ఇద్దరు ‘గీతం’ ప్రొఫెసర్లు మృతి

సాగర్‌నగర్‌, మే 6:


గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కొవిడ్‌తో కన్నుమూశారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.రవిశంకర్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. అలాగే గీతం వీడీసీ (వెంచర్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ లెబెన్‌జాన్సన్‌ కరోనాతో చికిత్స పొందుతూ గీతం ఆస్పత్రిలో కన్నుమూశారు. రవిశంకర్‌, లెబెన్‌జాన్స్‌న్‌ మృతికి గీతం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ బి.గుణశేఖరణ్‌, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తమ సంతాపం వ్యక్తం చేశారు. 


ఒకేరోజూ రిటైర్డ్‌ ఎస్‌ఐ,ఆయన కుమారుడు...

మరో రిటైర్డ్‌ ఎస్‌ఐ, ఆయన భార్య కూడా...


విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా నగరానికి చెందిన రిటైర్డ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అడపా సత్యారావు(63)తోపాటు ఆయన కుమారుడు ఒకేరోజు మృతిచెందారు. అడపా సత్యారావు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి నగరంలోనే ఎస్‌ఐగా చాలాకాలం పనిచేసి మూడేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. నగరంలో ఎంతోమందికి ఆయన సుపరిచుతులు. కరోనా కారణంగా సత్యారావుతోపాటు ఆయన పెద్దకుమారుడు అరుణ్‌కుమార్‌ (35) కొద్దిరోజుల కిందట ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఒకరి తర్వాత ఒకరు మృతిచెందారు. అరుణ్‌కుమార్‌కు మూడేళ్ల కిందట వివాహం కాగా ఆరు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. కాగా మరో విశ్రాంత ఎస్‌ఐ జగన్నాథరావు (64)తోపాటు ఆయన భార్య కూడా కరోనా కారణంగా మృతిచెందారు. రిటైర్డ్‌ అధికారుల మృతి పోలీస్‌వర్గాల్లో విషాదం నింపింది. 


పెళ్లిళ్లకు గండం


20 మందికే అనుమతి...కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి

విచిత్రమైన నిబంధనలపై పెదవి విరుపులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘ఎంకి పెళ్లి..సుబ్బి చావుకు వచ్చింది’అన్నట్టుగా ఈ కరోనా వల్ల శుభకార్యాలకు అనుమతి లభించడం లేదు. ఎక్కువ మంది గుమిగూడితే కరోనా వ్యాపిస్తుందని ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలను నిబంధనలు విధించి, వాటిని పాటించే వారికే పరిమితంగా అనుమతిస్తోంది. 


ఇది పెళ్లిళ్ల సీజన్‌. మే 8వ తేదీ నుంచి నెలాఖరు వరకు బోలెడు ముహూర్తాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పెళ్లికి 20 మందికి మాత్రమే అనుమతించాల్సి ఉంది. దీనికి కూడా తగిన పత్రాలు సమర్పించాలి. వధూవరులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, హాజరయ్యేవారు అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఆ నివేదికను, పెళ్లి కార్డుతో పాటు అభ్యర్థనకు జత చేసి మండల తహసీల్దార్‌కు సమర్పించాలి. నివేదికలో నెగెటివ్‌ అని వున్న వారినే అనుమతిస్తారు. ఇదీ విధానం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్ష చేయించుకోవడమే గగనంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే...అప్పటివరకూ లేకపోయినా...అప్పుడు వైరస్‌ బారినపడేలా వాతావరణం ఉంటోంది. ఏదో తంటాలు పడి పరీక్ష చేయించుకున్నా వారం రోజుల వరకు ఫలితం రావడం లేదు. పోనీ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుందామంటే...అక్కడ పలుకుబడి కలిగిన వారికి, రాజకీయ నేతల సిఫారసు చేయించుకున్న వారికే పరీక్షలు చేస్తున్నారు. ఈలోపు పెళ్లి ముహూర్తం దాటిపోతోంది. దీనికి తగిన పరిష్కారం చూపించాలని పెళ్లి కుటుంబాటు కోరుతున్నాయి. విశాఖపట్నం వంటి నగరాల్లో కొంతమంది తహసీల్దార్లు కావాలనే పెళ్లి కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి లేనిపోని నిబంధనలు పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Updated Date - 2021-05-07T05:22:57+05:30 IST