Bizarre: న్యాయవాదిని కరిచిన రెండు పెంపుడు శునకాలకు 'మరణ శిక్ష'..!

ABN , First Publish Date - 2021-07-14T00:28:53+05:30 IST

మనుషులపై శునకాలు దాడి చేయడం అనేది సాధారణ విషయమే. దాడిలో మనుషులు గాయపడడం కూడా సర్వసాధరణమే. అంతమాత్రాన కరిచిన కుక్కులకు మరణ శిక్ష విధిస్తారా?

Bizarre: న్యాయవాదిని కరిచిన రెండు పెంపుడు శునకాలకు 'మరణ శిక్ష'..!

కరాచీ: మనుషులపై శునకాలు దాడి చేయడం అనేది సాధారణ విషయమే. దాడిలో మనుషులు గాయపడడం కూడా సర్వసాధరణమే. అంతమాత్రాన కరిచిన కుక్కులకు మరణ శిక్ష విధిస్తారా? అంటే.. సాధారణంగా వచ్చే సమాధానం కాదు అని మాత్రమే. కానీ, పాకిస్తాన్‌లో ఓ న్యాయవాదిని కరిచిన రెండు పెంపుడు శునకాలు ఇప్పుడు 'మరణ శిక్ష'ను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు న్యాయస్థానం పర్యవేక్షణలో శునకాల యజమాని, బాధితుడి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


అసలేం జరిగిందంటే.. మార్నింగ్​ వాక్​ కోసం బయటకు వచ్చిన కరాచీకి చెందిన సీనియర్​ న్యాయవాది మీర్జా అఖ్తర్​‌పై అదే ప్రాంతానికి చెందిన రెండు పెంపుడు జర్మన్​ షెపార్డ్​ శునకాలు ఆయనపై దాడి చేశాయి. ఒక్కసారిగా ఆయనపై పడి బాగా కరిచేశాయి. ఈ దాడిలో న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో ఆ శునకాలను పెంచుకుంటున్న హుమాయున్​ ఖాన్​పై నెటిజన్లు మండిపడ్డారు. 


క్రూరమైన శునకాలను సరియైన శిక్షణ ఇవ్వకుండా ఇలా ఇళ్ల మధ్య ఉంచుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక అక్త‌ర్ న్యాయవాది కావడంతో ఈ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో చివరికి కుక్కల యాజమాని హుమయూన్ రాజీకి వచ్చాడు. మీర్జా- హుమాయున్​ మధ్య కోర్టుబయట కుదిరిన ఒప్పందంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ, మీర్జా అఖ్తర్ రాజీకి అంగీకరిస్తూనే హుమయూన్‌కు షరతులు విధించారు.


మీర్జా షరతుల్లో మొదటిది ఆయనకు క్షమాపణ చెప్పడం. రెండోది ఆ రెండు శునకాలకు పశువైద్యుల సమక్షంలో విషపూరిత ఇంజక్షన్లతో చంపించాలి. అంటే.. వాటికి మరణ శిక్ష విధించాలి. అలాగే ఆయన దగ్గర వేరే పెంపుడు కుక్కలు ఉంటే వెంటనే వాటిని ఇతరులకు ఇచ్చేయాలి. ఇక కోర్టు బయట మీర్జా-హుమయూన్ మధ్య కుదిరిన శునకాలకు మరణ శిక్ష విధించడమనే ఒప్పందంపై జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇది ఎంతమాత్రం సమంజసం కాదని మండిపడుతున్నారు.  



Updated Date - 2021-07-14T00:28:53+05:30 IST