కొవిడ్‌ ఆస్పత్రిలో ఇద్దరి మృతి.. కరోనాతో కాదంటూ ఒకరి మృతదేహం అప్పగింత

ABN , First Publish Date - 2020-04-10T18:41:21+05:30 IST

కరోనా మహమ్మారి కలవరపెడుతూనే ఉంది. పాజిటివ్‌ కేసుల నమోదులో ఒక రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువ.. అంతే తప్ప వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే విజయవాడ నగరంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

కొవిడ్‌ ఆస్పత్రిలో ఇద్దరి మృతి.. కరోనాతో కాదంటూ ఒకరి మృతదేహం అప్పగింత

వీడని భయం.. గురువారం పాజిటివ్‌ కేసులు నిల్‌

కొవిడ్‌ ఆసుపత్రిలో ఇద్దరి మృతి

కరోనా కాదంటున్న వైద్యాధికారులు 

ఒకరి మృతదేహం బంధువులకు అప్పగింత

మార్చురీలోనే మరొకరి మృతదేహం 

కృష్ణా జిల్లాలో నిలకడగా పాజిటివ్‌ కేసులు

222 మంది రిపోర్టుల కోసం నిరీక్షణ  


ఆంధ్రజ్యోతి, విజయవాడ: కరోనా మహమ్మారి కలవరపెడుతూనే ఉంది. పాజిటివ్‌ కేసుల నమోదులో ఒక రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువ.. అంతే తప్ప వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే విజయవాడ నగరంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గురువారం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు నిలకడగా 35 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న కరోనా అనుమానితులకు సంబంధించిన 222 మంది నమూనాల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఒక రోజు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదని.. జిల్లాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. 


కృష్ణా జిల్లాలో గురువారం పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోయినా వైరస్‌ వ్యాపిస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న కరోనా అనుమానితులకు సంబంధించిన 222 మంది నమూనాల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు మృతి చెందారు. వారి మరణాలకు కరోనా కారణం కాదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. వైద్యపరీక్షల రిపోర్టు నెగెటివ్‌ రావడంతో ఒకరి మృతదేహాన్ని గురువారం బంధువులకు అప్పగించేశారు. మరొకరి మృతదేహాన్ని రిపోర్టులు రాకపోవడంతో మార్చురీలోనే భద్రపరిచారు.  ఫ బందరులో రోల్డ్‌గోల్డ్‌ వ్యాపారికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఇటీవల విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులనూ క్వారం టైన్‌లో ఉంచారు. పెడన క్వారంటైన్‌లో ఉన్న అతని సోదరుడికి గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అంబులెన్స్‌లో విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయంత్రానికి రిపోర్టులు రాగా, కరోనా నెగెటివ్‌ అని తేలడంతో వైద్యాధికారులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 


ముదినేపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా గురువారం విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చనిపోయారు. ఈయనది కూడా కరోనా మరణం కాదని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు తొలుత విజయవాడ జనరల్‌ ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరుకు.. అక్కడి నుంచి మళ్లీ విజయవాడ ఆసుపత్రికి తిప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో గురువారం ఉదయం అతను మృతిచెందాడు. రిపోర్టులు వచ్చే వరకు మృతదేహాన్ని మార్చురీలోనే భద్రపరిచారు. 

Updated Date - 2020-04-10T18:41:21+05:30 IST