ఒకేసారి డబ్బులు చెల్లిస్తే రెండు శాతం రాయితీ

ABN , First Publish Date - 2022-05-29T05:17:46+05:30 IST

ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్‌ కొనుగోలు చేసిన వ్యక్తి ఒకేసారి పూర్తి డబ్బులు చెల్లిస్తే రెండు శాతం రాయితీ లభిస్తుందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

ఒకేసారి డబ్బులు చెల్లిస్తే రెండు శాతం రాయితీ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, మే 28: ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్‌ కొనుగోలు చేసిన వ్యక్తి ఒకేసారి పూర్తి డబ్బులు చెల్లిస్తే రెండు శాతం రాయితీ లభిస్తుందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సి ఫంక్షన్‌హాల్‌లో శనివారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్లు, గృహాల విక్రయంపై ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన సిమెంట్‌, ఇనుము, ఇసుకతో ధరణి టౌన్‌షిప్‌లోని భవనాలు నిర్మించారని తెలిపారు. ఈఎండీ జిల్లా కలెక్టర్‌ పేరిట పది వేల రూపాయలు చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. ధరణి టౌన్‌షిప్‌ వెనుకవైపు గేటు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొని ఎటువంటి చిక్కులు లేని ఓపెన్‌ ప్లాట్‌లను పొందాలని సూచించారు. ఈ అరుదైన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఏవో రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 2న కవి సమ్మేళనం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ స్ఫూర్తి’ అనే అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల కవులు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కవి సమ్మేళనం సమన్వయకర్త ప్రభుత్వ తెలుగు పండిట్‌ అంబీర్‌ మనోహర్‌రావు 96666 92226కు తమ పేరు, చిరునామా, వృత్తి, సెల్‌ నెంబర్‌ 20 పంక్తులకు మించకుండా కవితలను పంపి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేకించిన కమిటీ ఎంపిక చేసిన 20 కవితలను ఎంపిక చేసే వారికి మొబైల్‌ ద్వారా జూన్‌ 1 తేదీలోగా సమాచారం అందిస్తామని తెలిపారు.

నైపుణ్యాల అభివృద్ధితో మంచి అవకాశాలు

నైపుణ్యాల అభివృద్ధితో మంచి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. శనివారం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బాలరాజ్‌గౌడ్‌ మెమోరియల్‌ ఆడిటోరియంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిపాటి నైపుణ్యాలు పెంపొందిచుకుంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. ఉత్తరాది కంటే దక్షిణాదిలో సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉన్నారని అందులో హైదరాబాద్‌ వారు అధికంగా ఉంటారని తెలిపారు. మన జిల్లా నుంచి కూడా నిపుణులు ఎదగాలని, దేశంలో ఎక్కడైన ఉద్యోగం చేసేలా విద్యార్థులు సంసిద్ధులు కావాలని తెలిపారు. హెచ్‌సీఎల్‌ వారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో అనుసంధానమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న, ప్రిన్సిపాల్‌ కిష్టయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌, శంకర్‌ ప్రతినిధులు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:17:46+05:30 IST