ఇద్దరు బయటివారు జమ్మూ-కశ్మీరులో ఆస్తులు కొన్నారు : కేంద్రం

ABN , First Publish Date - 2021-08-10T23:24:48+05:30 IST

అధికరణ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు ఇద్దరు మాత్రమే

ఇద్దరు బయటివారు జమ్మూ-కశ్మీరులో ఆస్తులు కొన్నారు : కేంద్రం

న్యూఢిల్లీ : అధికరణ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు ఇద్దరు మాత్రమే జమ్మూ-కశ్మీరులో ఆస్తులు కొన్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. అయితే ఆ ఆస్తుల వివరాలను, వాటిని కొన్నవారి పేర్లను వెల్లడించలేదు. 


జమ్మూ-కశ్మీరులో ఆస్తులను కొనాలనుకునే ఇతర రాష్ట్రాలవారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అనే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు ఇద్దరు మాత్రమే 2019 ఆగస్టు తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఆస్తులను కొన్నారని చెప్పారు. ఆస్తులను కొన్న యజమానుల వివరాలను ఆయన వెల్లడించలేదు. జమ్మూ-కశ్మీరులో ఆస్తులను కొనేటపుడు ఇతర రాష్ట్రాలవారికి ఇబ్బందులు ఎదురైన సందర్భాలు నమోదు కాలేదని తెలిపారు. 


2019 ఆగస్టు 5న అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ-కశ్మీరులో వ్యవసాయేతర భూమిని కొనేందుకు ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందనివారికి అనుమతి ఇస్తూ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో నోటిఫై చేసింది. 


Updated Date - 2021-08-10T23:24:48+05:30 IST