మరో ఇద్దరికి కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-05-29T11:44:11+05:30 IST

పి.గన్నవరం మండలం ముంగండలో గురువారం ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ముంబైలో ఉంటున్న వీరిద్దరు ..

మరో ఇద్దరికి కరోనా వైరస్‌

పి.గన్నవరం మండలం ముంగండలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ

బుధవారం ముంబైనుంచి వచ్చి నేరుగా అమలాపురం క్వారంటైన్‌కు 

పరీక్షలు చేయగా కొవిడ్‌ నిర్ధారణ..  ఇద్దరూ అన్నదమ్ములే

జిల్లాలో 162కి చేరిన కొవిడ్‌ కేసుల సంఖ్య

జీజీహెచ్‌లో మామిడాడ మృతుడికి చికిత్స చేసిన వార్డులో  23 మంది వైద్యులకు నెగిటివ్‌

పాజిటివ్‌ సోకిన మహిళకు పండంటి మగబిడ్డ.. ఇద్దరూ క్షేమం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పి.గన్నవరం మండలం ముంగండలో గురువారం ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ముంబైలో ఉంటున్న వీరిద్దరు స్వస్థలానికి బుధవారం ఉదయం చేరుకు న్నారు. నేరుగా ఇంటికి వెళ్లకుండా అమలాపురం ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గురువారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అన్నదమ్ములైన వీరిద్దరిలో ఒకరి వయస్సు 24, మరొకరిది 23. దీంతో వీరిని అమలాపురం కిమ్స్‌ ఐ సోలేషన్‌ వార్డుకు తరలించారు. ఈ రెండు కేసులు కలిపితే జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసులు 162కు చేరుకున్నాయి.


మరోపక్క మామిడాడ కొవిడ్‌ మృతుడి ద్వారా వైరస్‌ వ్యాపించి గడచిన ఎనిమిది రోజులుగా పదుల సంఖ్య కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ పాజిటివ్‌ల పరంపరకు కొంత బ్రేక్‌ పడినట్లయింది. కాగా గతవారం అనారోగ్యంతో జీజీహెచ్‌లో చేరిన మామిడాడ మృతుడికి కొందరు వైద్యు లు చికిత్స చేశారు. అదే వార్డులో మిగిలిన రోగులకు ఇతర వైద్యులు కూడా ఆరోజు వైద్య సేవలు అందించారు. అయితే సదరు మామిడాడ వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందడంతో మొత్తం 28 మంది జీజీహెచ్‌ వైద్యులను కాకినాడ నగరంలో ఓ హోటల్‌లో క్వారంటైన్‌కు తరలించారు. వీరి నుంచి శాంపిళ్లు సేకరించి టెస్ట్‌లు చేయగా అందరికి గురువారం నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. దీంతో వైద్యులు, ఇతర అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క నాలుగురోజుల కిందట మామి డాడ మృతుడి ద్వారా వైరస్‌ వ్యాపించి పాజిటివ్‌ వచ్చిన తొమ్మిది నెలల గర్భిణి రాజమహేంద్రవరంలో జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. కాగా గురువారం ఈమె పండంటి మగబిడ్డను ప్రసవించింది. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈమెకు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేశారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమమేనని వైద్యులు ప్రకటించారు.


కొత్తగా రెండు కంటైన్మెంట్‌ జోన్లు : కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 28: ప్రజలప్రాణ రక్షణే లక్ష్యంగా కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లాలో కొత్తగా రెండు ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లను నోటిఫై చేస్తూ కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు. తుని మున్సిపాలిటీలో 7వ వార్డు, 6,8,9 వార్డుల పరిధిలోని కంకిపాటివారి గరువు, అమ్మాజీపేట ప్రాంతాలను కోర్‌ ఏరియాలుగాను, 6,8,9,10 వార్డులు పాక్షికంగాను, 1, 5 వార్డు ప్రాంతాలను బఫర్‌ ఏరియాలుగా ప్రకటించారు. అలాగే బిక్కవోలు మండలం మెళ్లూరులో అవ్వారి వారి వీధి, పంచాయతీ వీధి, శివాలయం వీఽధులను కోర్‌ ఏరియాలుగాను, చాకలిపేట, అరికిరేవుల రోడ్డు ఏరియా, కొమ్మనవారివీధి ప్రాంతాలను బఫర్‌ జోన్‌గా ప్రకటించారు. కంటైన్మెంట్‌ జోన్‌గా గతంలో ప్రకటించిన పెద్దాపురం అర్బన్‌ పరిధిలోని వార్డు నెం 6, రాజుగారి వీధిలో గడిచిన 28 రోజుల కాలంలో కొత్తగా కరోనా వైరస్‌ కేసులేవీ నమోదుకాకపోవడంతో కంటైన్మెంట్‌ జోన్‌ను ఉపసంహరిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2020-05-29T11:44:11+05:30 IST