మరో రెండు పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-05-27T10:10:31+05:30 IST

జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసు వెలుగు చూశాయి. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరుకు చెందిన ..

మరో రెండు పాజిటివ్‌లు

ఇనమనమెళ్లూరుకు చెందిన మహిళకు వైరస్‌

గుంటూరు జిల్లా వాసికీ నిర్ధారణ

జిల్లా వ్యాప్తంగా ఐదో విడత సర్వే

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని 

గుర్తిస్తున్న వైద్య,ఆరోగ్యశాఖ

కంటైన్మెంట్‌ నుంచి ఒంగోలును తొలగించే అవకాశం


ఒంగోలు నగరం, మే 26 : జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసు వెలుగు చూశాయి. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరుకు చెందిన మహిళకు వైరస్‌ ఉన్నట్లు తేలింది. గుంటూరు జిల్లాకు చెందిన మరో మహిళకు ఇక్కడ చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాపట్లలో ఉం టున్న ఈమె నాలుగు రోజుల క్రితం చీరాల ఏరియా ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ట్రూనాట్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె నుంచి శ్వాబ్‌ తీసి వీఆర్‌డీఎల్‌కు పంపించగా కరోనా ఉన్నట్లు తేలింది. కాగా ఆమెను గుంటూరులోని కొవిడ్‌ సెంటర్‌కు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మహిళ భర్త కరోనా బారినపడి చెన్న్తెలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈమెకు ఇక్కడ పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో ఈమెతోపాటే ఉన్న కుమార్తె నుంచి శ్వాబ్‌ తీసి వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌కు పంపారు.


ఇంకా ఫలితం రావాల్సి ఉంది. ఇదలా ఉండగా ఇనమనమెళ్లూ రుకు చెందిన మహిళ ఇటీవల చెన్నై నుంచి వచ్చినట్లు తెలిసింది. ఆమె శ్వాబ్‌ను వైద్యులు పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇనమన మెళ్లూరుకు చెందిన మహిళను మాత్రమే మన జిల్లా కేసుల జాబితాలో చేర్చారు. మరో మహిళది గుంటూరు జిల్లా కావడంతో ఆమెను అక్కడికి పంపనున్నారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71కు చేరింది.  


మరోసారి సర్వే

జిల్లాలో జ్వరపీడితులు, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సర్వే చేపట్టింది. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఐదో విడత సర్వే నిర్వహించనున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వివరాలను అప్‌లోడ్‌ చేయనున్నారు. ఆ ప్రకారం ప్రభుత్వం వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా వలంటీర్లు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలన్నింటినీ వలంటీర్లతోపాటు ఏఎన్‌ఎంలు సేకరిస్తున్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నారు. వీరికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.


విదేశాల నుంచి వస్తే క్వారంటైనే

జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారిని కచ్ఛితంగా 14రోజులు క్వారెంటైన్‌లో ఉంచనున్నారు. కరోనా నిర్ధారణ కోసం వీరికి నేరుగా వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేయటంతోపాటు నెగెటివ్‌ వచ్చినా క్వారంటైన్‌లోనే ఉంచనున్నారు. ప్రస్తుతం ఖతార్‌, ఫిలిప్పైన్స్‌, లండన్‌ నుంచి వచ్చిన వారిని ఒంగోలులోని క్వారంటైన్‌కు పంపారు. మరికొన్ని దేశాల నుంచి కూడా జిల్లాకు వచ్చే వారి వివరాలను ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. వీరికి పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్‌కు తరలించనున్నారు. 


ఒంగోలులో ఆంక్షలు ఎత్తివేసే అవకాశం 

ఒంగోలు నగరంలో కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవటంతో కంటైన్మెంట్‌ పరిధి నుంచి తొలగించే అవకాశం క నిపిస్తోంది. ఈ దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన ఇస్లాంపేటలో మరో 100 మంది అనుమాని తుల నుంచి శ్వాబ్‌లను సేకరించి పరీక్షలు  నిర్వహించనున్నారు. వారికీ నెగెటివ్‌  వస్తే కంటెన్మెంట్‌ నుం చి తొలగించొచ్చు.

Updated Date - 2020-05-27T10:10:31+05:30 IST