‘విజయ’లో రేపే పోలింగ్‌

ABN , First Publish Date - 2020-09-25T06:23:29+05:30 IST

జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి (విజయడెయిరీ)లో ఎన్నికల కోలాహలం జోరందుకుంది.

‘విజయ’లో రేపే పోలింగ్‌

మూడు డైరెక్టర్‌ పదవుల్లో రెండు ఏకగ్రీవం

ఆ ఒక్కటి కోసం రంగారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పోటీ 

ఉదయం 8 నుంచి 1 వరకు ఓటింగ్‌, మధ్యాహ్నం ఫలితాలు

ఇరు వర్గాల ప్రచారం ముమ్మరం

118 మంది సొసైటీ సభ్యులకు ఓటు హక్కు


 నెల్లూరు ( వెంకటేశ్వరపురం)సెప్టెంబరు 24 : జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి (విజయడెయిరీ)లో ఎన్నికల కోలాహలం జోరందుకుంది. ఈనెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల అధికారి హరిబాబు మూడు డైరెక్టర్‌ పోస్టుల ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. రెండు మహిళా రిజర్వు స్థానాల్లో కన్నా ఇందిరమ్మ, సూదలగుంట సాయినిరోషా నామినేషన్‌ వేశారు. వారిపై ఎవరూ పోటీ చేయలేదు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తయింది. దాంతో ఆ ఇద్దరు మహిళా అభ్యర్థులు ఎకగ్రీవంగా  ఎన్నికైనట్టు  ఎన్నికల అధికారి ప్రకటించారు. మూడో డైరెక్టర్‌ పదవి కోసం ప్రస్తుత చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, నారికేళ్లపల్లి పాల సొసైటీ సభ్యుడు కోట చంద్రశేఖర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎవరూ నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. దాంతో ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 26వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు జరిపి అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లా వ్యాపితంగా 118 మంది పాల సొసైటీ సభ్యలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుత చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి కి అరటిపండు గుర్తు , ప్రత్యర్థి చంద్రశేఖర్‌రెడ్డికి ఇటుక గుర్తును కేటాయించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.  ఇరువర్గాల సొసైటీ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు.

Updated Date - 2020-09-25T06:23:29+05:30 IST