మరో రెండు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-03-26T07:38:13+05:30 IST

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడేళ్ల బాలుడు ఉన్నాడు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ బాలుడికి...

మరో రెండు కరోనా కేసులు

  • హైదరాబాద్‌లో మూడేళ్ల బాలుడికి..
  • లండన్‌ వెళ్లొచ్చిన భర్త ద్వారా భార్యకు..
  • రాష్ట్రంలో 41కి చేరిన పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడేళ్ల బాలుడు ఉన్నాడు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ బాలుడికి సౌదీ ట్రావెల్‌ హిస్టరీ ఉంది. ఆ బాలుడి తల్లిదండ్రులకు కూడా గురువారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం ప్రైమరీ కాంటాక్టు ద్వారా ఒక మహిళకు కరోనా సోకింది. లండన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి(49)కి పాజిటివ్‌ రాగా... అతడి భార్య (40)కు కరోనా సోకింది. అలాగే మణికొండ, కోకాపేట పరిధిలోనే ప్రైమరీ కాంటాక్టు ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో ప్రైమరీ కాంటాక్టు ద్వారా కరోనా వచ్చిన వారి సంఖ్య ఆరుకు చేరింది. మొత్తంగా తెలంగాణలో కేసుల సంఖ్య 41కి చేరింది. వరుసగా 12వ రోజూ కేసులు నమోదయ్యాయి.


  • ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ కరోనా పరీక్షలు
  • మూడింటికి ఐసీఎంఆర్‌ అనుమతి

రాష్ట్రంలోని మూడు ప్రైవేటు లేబొరేటరీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా ల్యాబ్‌ల సంఖ్య మొత్తం పదికి చేరుకుంటాయి. ఐసీఎంఆర్‌ తాజాగా అనుమతినిచ్చిన వాటిలో జూబ్లీహిల్స్‌లోని అపోలో, హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్స్‌, చర్లపల్లిలోని వింటా ల్యాబ్‌ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, ఐపీఎమ్‌, నిమ్స్‌, కేఎంసీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. సీసీఎంబీలోనూ పరీక్షలకు పచ్చజెండా ఊపిం ది. ఆరు ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 720 టెస్టులు చేయవచ్చు. సీసీఎంబీలో 1000 వరకు నమూనాలను పరీక్షించవచ్చు. తాజాగా మూడు ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతినివ్వడంతో కరోనా నిర్ధారణ సామర్థ్యం మరింత పెరగనుంది. 


Updated Date - 2020-03-26T07:38:13+05:30 IST