మరో రెండు కార్గో కారిడార్‌లు

ABN , First Publish Date - 2022-07-06T06:18:40+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ లాజిస్టిక్స్‌ విభాగం మరో రెండు కార్గోకారిడార్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఒక కార్గోకారిడార్‌ను గుర్తించి కంటైనర్ల ద్వారా సరకు రవాణా చేస్తున్నది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రూట్‌లో గాజువాక, స్టీల్‌సిటీ, అనకాపల్లి, తుని ఇలా హైదరాబాద్‌ వరకు ఎన్నో పీటీడీ లాజిస్టిక్స్‌ పాయింట్లు ఉన్నాయి.

మరో రెండు కార్గో కారిడార్‌లు
కార్గో రవాణాకు వినియోగిస్తున్న క్లోజ్డ్‌ కంటైనర్లు

క్లోజ్డ్‌ కంటైనర్లతో సరకు రవాణా 

పీటీడీ అధికారుల చర్యలు 

మెరుగైన ఆదాయం, సత్వర సేవలే లక్ష్యంగా ప్రణాళికలు  

ద్వారకాబస్‌స్టేషన్‌, జూలై 5: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ లాజిస్టిక్స్‌ విభాగం మరో రెండు కార్గోకారిడార్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఒక  కార్గోకారిడార్‌ను గుర్తించి కంటైనర్ల ద్వారా సరకు రవాణా చేస్తున్నది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రూట్‌లో గాజువాక, స్టీల్‌సిటీ, అనకాపల్లి, తుని ఇలా హైదరాబాద్‌ వరకు ఎన్నో పీటీడీ లాజిస్టిక్స్‌ పాయింట్లు ఉన్నాయి. ఇవికాకుండా ఆథరైజ్డ్‌ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ఈ సెంటర్లలో బుకింగ్‌ అయిన పార్సిల్స్‌ ఇతర కార్గోను  రెండు భారీ క్లోజ్డ్డ్‌  కంటైనర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. ఈ కారిడార్‌లో ఉన్న అన్ని లాజిస్టిక్స్‌ కేంద్రాల ఆథరైజ్డ్‌ ఏజెన్సీల సంబంధించిన సరకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రవాణా ఈ కంటైనర్ల ద్వారానే జరుగుతుంది. దీనివల్ల  పార్శిళ్లకు భద్రత, ఎకౌంటబులిటీ ఉంటుందని అఽధికారులు అభిప్రాయపడుతున్నారు.  పార్శిళ్లు తొందరగా గమ్యానికి చేరుకుంటాయని. లాజిస్టిక్ట్స్‌ వినియోగదారులకు సత్వర రవాణా సేవలు అందుతాయని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.  


సాధారణ బస్సులతో ఇబ్బందులు 

కార్గో కారిడార్‌  నిర్వాహణకు ముందు ఈరూట్‌లో  బస్సుల ద్వారానే పార్శిళ్లు రవాణా  చేసేవారు. బస్సుల్లో పార్శిళ్లకు కేటాయించిన స్థలం తక్కువ కావడం, పార్శిళ్లు ఎక్కువ రావడంతో రెండు మూడు రోజుల పాటు పార్శిళ్లు గొడౌన్లలోనే ఉండిపోయిన పరిస్థితి. దీనివల్ల రవాణాలో జాప్యం జరిగేది. వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యేవారు. పండ్లు, కాయలు, విజిటబుల్స్‌ వంటివి ఒక రోజుకంటే ఎక్కువ సమయం గొడౌన్‌లో ఉండిపోవడం, రవాణాకు మరో రోజు పట్టడం, డెలివరీకి మరి కొంత సమయం పట్టడం వల్ల వాటి నాణ్యత పాడయ్యేది. అదీ కాకుండా బస్సుల ద్వారా పార్శిళ్లు రవాణా చేయడం వల్ల ఈ రూట్‌లోని అన్ని లాజిస్టిక్స్‌ పాయింట్లవద్ద, ఆథరైజ్డ్‌ ఏజెన్సీ పాయింట్ల వద్ద బస్సులు నిలిపి, పార్శిల్స్‌ లోడ్‌చేయడం, కొన్ని  అన్‌లోడింగ్‌ చేయడం వల్ల ఎక్కువ సమయం  నిలిచి పోవల్సివస్తుంది. దీనివల్ల బస్సులు షెడ్యూల్‌ సమయానికి గమ్యానికి చేరుకోలేకపోతున్నాయి. అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికిగురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్గో కారిడార్‌ను ఏర్పాటు చేసుకుని ఆయా రూట్లలో అవసరమైనన్ని కంటైనర్లను నడుపుతూ పార్శిళ్లు, ఇతర సరకులు సకాలంలో వినియోగదారుల చెంతకు చేర్చేందుకు పీటీడీ సరికొత్త ప్రయోగం చేసింది. దీనివల్ల ప్రయాణికులను రవాణా చేసే బస్సులకు ఎటువంటి అంతరాయం లేకుండా షెడ్యూల్‌ సమయానికే గమ్యానికి చేరుకోగలుగుతున్నాయి. మొదటగా విశాఖ -హైదరాబాద్‌ మధ్య కార్గోకారిడార్‌ను ఏర్పాటు చేసి కంటైనర్ల ద్వారా సరకు రవాణా నిర్వహిస్తున్నది. 


మరో రెండింటికి ప్రణాళికలు   

విశాఖ - విజయవాడ ఒక కార్గో కారిడార్‌గాను, విశాఖ - ఇచ్ఛాపురం మరో కారో ్గకారిడార్‌గాను గుర్తించి ఈ రూట్‌లలో కూడా కంటైనర్ల ద్వారా సరకు రవాణా చేసేందుకు నిర్ణయించింది. విశాఖ-హైదరాబాద్‌ల మధ్య నిర్వహిస్తున్న కార్గో కారిడార్‌ మంచి ఫలితాలు ఇస్తుండటంతో ఈ రెండు రూట్లను కార్గోకారిడార్‌లుగా గుర్తించి సరకు రవాణా చేయాలని నిర్ణయించింది.  విశాఖ - విజయవాడ, విశాఖ-ఇచ్ఛాపురం మధ్య ప్రస్తుతం బస్సుల ద్వారా ఎంతసరకు రవాణా జరుగుతున్నది. ఈ రూట్ల మధ్య ఉన్న లాజిస్టిక్స్‌ పాయింట్‌లలోను, ఆథరైజ్డ్‌ ఏజెన్సీల్లోను ఎన్ని పార్శిళ్లు బుక్‌ అవుతున్నాయి. బస్సుల్లో కార్గోకు ఉన్న స్థలం ఎంత అనే విషయాన్ని అధికారులు లెక్కలుగట్టారు.  ఈ రెండు రూట్‌లలో ఎన్ని కంటైనర్లు నడపాలన్నది అంచనా వేస్తున్నారు. ఈ రెండు రూట్లలో కార్గో రవాణాకు అవసరమైన కంటైనర్లు సిద్ధం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ఈ రెండు కారిడార్‌లలోను లాజిస్టిక్స్‌ కంటైనర్లు నడుపుతామని పీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-07-06T06:18:40+05:30 IST