అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటూ డాక్టర్‌కి కుచ్చుటోపీ!

ABN , First Publish Date - 2020-10-31T19:44:19+05:30 IST

అల్లావుద్దీన్ అద్భుత దీపం అమ్ముతామంటూ ఓ వైద్యుడి నుంచి ఇద్దరు వ్యక్తులు రూ.31 లక్షలు వసూలు చేసిన వైనమిది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో..

అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటూ డాక్టర్‌కి కుచ్చుటోపీ!

మీరట్: అల్లావుద్దీన్ అద్భుత దీపం అమ్ముతామంటూ ఓ వైద్యుడి నుంచి ఇద్దరు వ్యక్తులు రూ.31 లక్షలు వసూలు చేసిన వైనమిది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం ముగ్గురు వ్యక్తులకు ఈ చీటింగ్ కేసులో ప్రమేయం ఉందనీ.. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితుడు డాక్టర్ ఎల్ఏ ఖాన్ కథనం ప్రకారం.. నిందితులిద్దరూ తమ తల్లికి అనారోగ్యంగా ఉందంటూ ఇటీవల డాక్టర్‌ ఖాన్‌ను ఇంటికి తీసుకెళ్లారు. క్రమంగా ఆయనతో పరిచయం పెంచుకుని మోసానికి ఒడిగట్టారు. నిందితులు తమ కనికట్టుతో నిజంగానే ఆ దీపం నుంచి ‘‘జీని’’ వచ్చినట్టు నమ్మించారు. అయితే ఆయన దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఎన్నిసార్లు ప్రయోగించినా ఎలాంటి అద్భుతం జరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ‘‘ ఓ మహిళకు వైద్యం చేసేందుకు నేను వారి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాను. దాదాపు నెలరోజులు వాళ్లింటికి విజిట్స్ కోసం వెళ్లాను. క్రమంగా వాళ్లు నాకు ఓ బాబా గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆయన తమ ఇంటికి కూడా వచ్చాడనీ.. మీరు కూడా కలవండి అంటూ నా బుర్ర తినేశారు. ఆ బాబా దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్లి అతడికి తాంత్రిక మహిమలు ఉన్నట్టు నమ్మించారు...’’ అని బాధితుడు పేర్కొన్నారు.


‘‘బాబా’’  దగ్గర ఓ బంగారు వర్ణపు దీపం చూపించి అందులో నుంచి  ‘‘జీనీ’’ని రప్పించినట్టు నిందితులు వైద్యుడిని నమ్మించారు. చివరికి నిందితుల్లోనే ఒకరు అల్లావుద్దీన్ వేషం వేసుకుని ప్రత్యక్షం కావడంతో తాను నిజంగానే ఆ దీపానికి మహిమలు ఉన్నాయని నమ్మానని డాక్టర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఆ దీపాన్ని రూ. 1.5 కోట్లకు అమ్ముతామంటూ నిందితులు చెప్పారనీ.. అయితే తాను ‘‘డౌన్ పేమెంట్ కింద రూ.31 లక్షలు మాత్రమే’’ కట్టానని ఆయన అన్నారు. ‘‘వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు నాకు నిజంగా ‘అల్లావుద్దీన్’ ప్రత్యక్షమయ్యేవాడు. అయితే అతడు ఎవరో అప్పుడు నాకు తెలిసేది కాదు. తర్వాత నిందితుల్లోనే ఒకడు ‘అల్లావుద్దీన్’  వేషం వేసుకున్నట్టు తేలింది..’’ అని సదరు వైద్యుడు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో వినిపించే జానపద కథ అరేబియన్ నైట్‌లోని ఓ కల్పిత పాత్రే అల్లావుద్దీన్. ఈ కథలో ‘అద్భుత దీపాన్ని’ రుద్దగానే అందులో నుంచి కోరికలు తీర్చే ‘జీని’ ప్రత్యక్షం అవుతాడు. 

Updated Date - 2020-10-31T19:44:19+05:30 IST