నకిలీ విత్తనాల కేసులో నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-16T01:45:41+05:30 IST

సంచలనం సృష్టించిన నకిలీ విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు

నకిలీ విత్తనాల కేసులో నిందితుల అరెస్ట్

సూర్యాపేట: సంచలనం సృష్టించిన నకిలీ విత్తనాల కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చింతలపాలెం మండలంలో సంచలనం సృష్టించిన రూ.13.5 కోట్ల నకిలీ విత్తనాల కేసులో నాగిరెడ్డి, మల్‌రెడ్డి సైదిరెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7.25 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, బైక్, 2 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


నకిలీ మిర్చి విత్తనాలపై దర్యాప్తు కొనసాగుతోంది. చింతలపాలెం మండలంలో ఓ విత్తన దుకాణం యజమాని ద్వారక సీడ్స్‌ పేరుతో నకిలీ విత్తనాలను అమ్మినట్లు ఆరోపణలు రావడంతో, ఆ దిశగా వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కొ ప్యాకెట్‌ ధర రూ.2వేల చొప్పున ఒక రైతుకు ఆరు ప్యాకెట్లు, మరో రైతుకు ఎనిమిది ప్యాకెట్లు అమ్మినట్లు జిల్లా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ జరపాలని సంబంధిత అధికారులు ఏఓను ఆదేశించారు. మండల కేంద్రానికి చెందిన కాటుబోయిన వీరన్నకు ‘స్టార్‌బిందు’ అనే పేరుతో ద్వారక సీడ్స్‌ కంపెనీకి చెందిన ఆరు మిర్చి విత్తనాల ప్యాకెట్లు, అదే మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందిన శేషం సుధాకర్‌ అవే ప్యాకెట్లు ఎనిమిది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.2వేల చొప్పున కొనుగోలు చేశారు. వీటి రశీదులను వ్యవసాయ అధికారులకు అందజేశారు.


కేవలం సూర్యాపేట జిల్లాలోనే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఇలాంటి నకిలీ మిర్చి, పుచ్చకాయ, ఇతర విత్తనాలను ఎంతమంది దుకాణాదారులకు అందజేశారో ఆరా తీస్తున్నారు. అక్కడ కూడా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో నకిలీ విత్తనాల తయారుదారులనుంచి రూ.10కోట్ల 93 లక్షల 25 వేల విలువగల మిర్చి విత్తనాల ప్యాకెట్లు, రూ. 11.50 లక్షల విలువజేసే 50 కిలోల టమాట విత్తనాలు, రూ.7.15 లక్షల విలువ జేసే 112 కిలోల బీరకాయ విత్తనాలు, రూ. 2.40 కోట్ల విలువగల 480 కిలోల పుచ్చకాయ విత్తనాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మిర్చి విత్తనాలను తయారు చేసిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మాలపాటి వెంకటశివారెడ్డిపై గతంలో కూడా పీడీ యాక్ట్‌ కేసులు నమోదై ఉన్నాయి. అయినా మళ్లీ అక్రమ వ్యాపారానికి దిగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-06-16T01:45:41+05:30 IST