ఇద్దరూ వ్యూహకర్తలే.. ఫలితంలో తేడా!

ABN , First Publish Date - 2020-06-01T07:59:34+05:30 IST

మహాభారతంలో శకుని, శ్రీకృష్ణుడు గొప్ప వ్యూహకర్తల్లా కన్పిస్తారు. కౌరవుల తల్లి గాంధారి సోదరుడైన శకుని.. హస్తినాపురానికి అంతర్గతంగా పగతో వస్తాడు. ‘హస్తినాపురం’ అనే సామ్రాజ్యం అతని దృష్టిలో అహంకారానికి...

ఇద్దరూ వ్యూహకర్తలే.. ఫలితంలో తేడా!

మహాభారతంలో శకుని, శ్రీకృష్ణుడు గొప్ప వ్యూహకర్తల్లా కన్పిస్తారు. కౌరవుల తల్లి గాంధారి సోదరుడైన శకుని.. హస్తినాపురానికి అంతర్గతంగా పగతో వస్తాడు. ‘హస్తినాపురం’ అనే సామ్రాజ్యం అతని దృష్టిలో అహంకారానికి ప్రతీక. అంధుడైన ధృతరాష్ట్రుడి వల్ల తన సోదరి జీవిత పర్యంతం కళ్లకు గంతలు కట్టుకుని ఉండడం కూడా అతని ప్రచ్ఛన్న వైరానికి కారణం. కానీ ఇది ఏనాడూ బయటపెట్టకుండా తన బావ, మేనల్లుళ్లకు మేలు చేసే వ్యక్తిగా నటిస్తూ కౌరవ నాశనానికి కారణం అయ్యాడు. దుష్టచతుష్టయంలో కీలకవ్యక్తిగా మారి దుర్యోధనుడిని పతనం వైపు తీసుకెళ్లాడు. ‘పెద్దరికం’గా సలహాలు ఇస్తూ దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను తన మైకంలో ముంచేశాడు. దుర్యోధనుడికి బాల్యం నుండే చెడ్డ సలహాలను ఇస్తూ పాండవులపై హద్దులు మీరిన ద్వేషం పెంచడంలో కీలకపాత్ర పోషించాడు. చివరకు యుద్ధం వరకూ తీసుకెళ్లి అంతమంది వీరుల, సైనికుల ప్రాణహరణానికి కారణం అయ్యాడు. 


  • దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేత్‌
  • ఉష్ణోదహతి చాఙ్గారః శీతః కృష్ణాయతే కరమ్‌

చెడ్డవారితో విరోధమూ, స్నేహమూ వద్దు. బొగ్గులు వేడిగా ఉన్నప్పుడు తాకితే చేతులు కాలుతాయి. చల్లగా ఉన్నప్పుడు తాకితే మసి అంటుతుంది. చెడ్డవారితో మంచైనా, చెడైనా అలాగే ఉంటుందని దీని అర్థం. అటువంటి వ్యక్తి సలహాలు విని కౌరవులు నాశనమయ్యారు.

ఇక పాండవులవైపు శ్రీకృష్ణుడు సలహాదారుగా ఉన్నాడు. యాదవుల ఆడపడచైన పృథ, కుంతీభోజుడి ఇంటికి దత్తపుత్రికగా వెళ్లింది. తన మేనత్త కొడుకులైన పాండవులను కాపాడేందుకు శ్రీకృష్ణుడు తన యావచ్చక్తినీ ఉపయోగించాడు. ధర్మవిజయం కోసం పాండవులను కంటికి రెప్పలా కాపాడాడు. తన సఖుడు, నరుడైన అర్జునుడి రక్షణకు అడుగడుగునా నిలబడ్డాడు. సుభద్రాకల్యాణం మొదలుకొని తన జీవన పర్యంతం.. ధర్మరక్షణకు, దుష్ట శిక్షణకూ, శిష్ట రక్షణకూ తన శక్తియుక్తులను వినియోగించాడు. ధర్మరక్షణ కోసం కొన్నిసార్లు పైకి అధర్మంగా కన్పించే పనులూ పాండవులతో చేయించాడు. ఆయుధం ధరించకుండా అధర్మాన్ని ఎదిరించాడు. శ్రీకృష్ణుడు ధర్మం అనే దేహం అయితే ఆ దేహానికి తల ధర్మరాజు, భీముడు రెండు బాహువులు, నకుల సహదేవులు రెండు కాళ్లు, హృదయం అర్జునుడు అని చెబుతారు. శ్రీకృష్ణుడు ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఇతరులు ఎన్ని ఉపాయాలు ప్రయోగించినా దానిని మార్చలేరని వైశంపాయనుడు చెప్పాడు. అంత గొప్ప రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణుడు. ఆ జగన్నాటక సూత్రధారి జీవితమే ఒక లీల. దుర్మార్గాన్ని మంచి ద్వారానే మార్చే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేస్తాడు. ధర్మం తన స్వరూపాన్ని కోల్పోయినపుడు, అధర్మం తల ఎత్తి తానే ధర్మమని దబాయిస్తున్నపుడు శ్రీకృష్ణుడి ‘ధర్మ సంస్థాపనార్థాయ’ సూత్రం వర్తిస్తుంది. కాబట్టే ఆ పరమాత్మ పాండవుల కష్టాలను తొలగిస్తానని చెప్పలేదు. సాక్షీభూతంగా ఉండి వాళ్లను ధర్మంవైపు నడిపించాడు. భారతదేశంలోని రాజులందరిని మొదటిసారి ‘ధర్మం - అధర్మం’ పేరిట రెండుగా విభజించి తన లక్ష్యం సాధించాడు. పాండవులకు సలహాదారుడిగా ఉండి ధర్మస్వరూపమై ‘‘ధర్మోరక్షతి రక్షితః’’ అన్న సూత్రాన్ని అమలు చేశాడు.             

- డా. పి. భాస్కరయోగి

Updated Date - 2020-06-01T07:59:34+05:30 IST