ములుగులో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

ABN , First Publish Date - 2020-10-18T22:27:26+05:30 IST

తెలంగాణలో మావోయిస్టుల జాడ లేకుండా చేయాలని చూస్తున్న పోలీసుల ప్రయత్నాలు కాస్త సక్సెస్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.

ములుగులో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

ములుగు జిల్లా : తెలంగాణలో మావోయిస్టుల జాడ లేకుండా చేయాలని చూస్తున్న పోలీసుల ప్రయత్నాలు కాస్త సక్సెస్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోలు దారుణంగా హత్య చేసిన తర్వాత.. వారి కోసం పోలీసులు కూంబింగ్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ ములుగు జిల్లా మంగపేట మండలం రామచంద్రునిపేట సమీప అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మావోలు తారసపడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ సాయిచైతన్య అధికారికంగా ప్రకటించారు.


మావోలు తారసపడగా..!

నర్సింహాసాగర్ సమీపంలోని నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొప్పుగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. కూంబింగ్ చేస్తున్న మా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. మా బలగాలపై మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం మా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన మావోలు ఎవరు..? ఏ ప్రాంతానికి చెందిన వారు..? వారి పూర్తి వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది’ అని ఏఎస్పీ సాయిచైతన్య ఓ ప్రకటనలో తెలిపారు.


మావోల లేఖ కలకలం..

ఇదిలా ఉంటే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పంబాపూర్‌ గ్రామ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడలపై అతికించిన లేఖ కలకలం సృష్టించింది. గత కొన్నిరోజులుగా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టిన నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ నక్సలైట్‌లు లేఖ రాయడంపై ఆయా పార్టీల ప్రజా ప్రతినిధుల్లోనూ వణుకు మొదలైంది. కరీంనగర్‌ , ఖమ్మం, వరంగల్‌ ఏరియా కమిటీ పేర కరపత్రాలను ప్రత్యక్షం అయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌ బంటు రమేష్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-18T22:27:26+05:30 IST