రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-05-23T07:30:07+05:30 IST

మండలంలోని వేములపాడు గ్రామం వద్ద ఆదివారం ఆటోను, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ప్రమాద స్థలంలో భయానక పరిస్థితి

యాడికి, మే22:  మండలంలోని వేములపాడు గ్రామం వద్ద ఆదివారం ఆటోను, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులంతా పామిడి మండలం రామరాజుపల్లి వాసులే. బాధితుల కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలమేరకు.. రామరాజుపల్లికి చెందిన ఒక వ్యక్తి తాడిపత్రి మండలంలోని ఇగుడూరు గంగమ్మ ఆలయం వద్ద దేవర నిర్వహిస్తుండగా.. అదే ఊరికి చెందిన లక్ష్మిరెడ్డి(32), రంగనాథ్‌రెడ్డి (25), ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మల్లికార్జునరెడ్డి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వీరు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై రామరాజుపల్లికి బయల్దేరారు. యాడికి మండలం వేములపాడు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్రవాహనం వేగంగా వెళ్లి ఢీకొనడంతో రెండు వాహనాలూ బోల్తాపడ్డాయి. ద్విచక్రవాహనంలో వెళ్తున్న లక్ష్మిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రంగనాథరెడ్డిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంగనాథరెడ్డి మృతిచెందాడు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జునరెడ్డిని చికిత్స నిమిత్తం తాడిపత్రికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. ఆటో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. మరణించిన లక్ష్మిరెడ్డి తనకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇతడికి భార్య చంద్రకళ, ఒక కుమార్తె ఉన్నారు. రంగనాథరెడ్డి అవివాహితుడు. తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులు చూసుకుంటుండేవాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


బ్లాక్‌స్పాట్‌లోనే... 

వేములపాడు వద్ద జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రదేశాన్ని గతంలోనే అధికారులు బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం బ్లింకర్స్‌ లైట్స్‌ ఏర్పాటుచేశారు. బ్లాక్‌స్పాట్‌కు సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ప్రమాదాల నివారణకు మరింత గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



Updated Date - 2022-05-23T07:30:07+05:30 IST