బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు

మరొకరికి తీవ్ర గాయాలు

అంబాజీపేట శివారులో మెదక్‌- చేగుంట రోడ్డుపై ఘటన 

 చిన్నశంకరంపేట, డిసెంబరు 1: కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం చోటు చేసుకోగా, ఆగ్రహానికి గురైన బంధువులు, గ్రామస్థులు రాస్తారోకోకు పూనుకున్నారు.   వివరాల్లోకి వెళ్తే..  మండలంలోని కొర్వీపల్లి గ్రామానికి చెందిన మాద పోచయ్య (35), తండ్రి బీరయ్య (55) తల్లి రాజమ్మతో కలిసి చిన్నశంకరంపేట సంతకు బైక్‌పై బయలుదేరారు. వారు అంబాజీపేట గ్రామ శివారులో మెదక్‌, చేగుంట రహదారిపైకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను వేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మాద పోచయ్య అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బీరయ్య, రాజమ్మను  మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో బీరయ్య మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన  మృతుల బంధువులు, గ్రామస్థులు అంబాజీపేట శివారు మెదక్‌ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సమాచార మందుకున్న రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌ రామాయంపేట సర్కిల్‌ ఎస్‌ఐలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని  గ్రామస్థులను సముదాయించేందుకు యత్నించినప్పటికీ వారు  రాస్తారోకోను విరమించలేదు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుని, మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతుల కుటుంబీకులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. రాస్తారోకోతో మెదక్‌ చేగుంట రహదారిపై ఎక్కడికకడ వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.   గవ్వలపల్లి, శంకరంపేట చౌరస్తాలో పోలీసులు బారికేడ్‌లను ఏర్పాటు చేసి వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా మరోదారి గుండా పంపించారు. మృతుడు పోచయ్యకు భార్య మౌనిక, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున్‌గౌడ్‌ తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST