క‌రోనా కాటు.. సౌదీ, యూఎస్‌లో ఇద్ద‌రు భార‌తీయులు మృతి !

ABN , First Publish Date - 2020-04-05T18:41:28+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా 8,454 మంది చ‌నిపోయారు.

క‌రోనా కాటు.. సౌదీ, యూఎస్‌లో ఇద్ద‌రు భార‌తీయులు మృతి !

వాషింగ్ట‌న్‌, రియాధ్‌: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా 8,454 మంది చ‌నిపోయారు. న్యూయార్క్ న‌గ‌రం క‌రోనా కేంద్రంగా మారిపోయింది. న్యూయార్క్‌లోనే 114,775 మంది కరోనా బారిన ప‌డ‌గా, 3,565 మంది చ‌నిపోయారు. తాజాగా ఈ మ‌హ‌మ్మారి న్యూయార్క్‌లో ఓ భార‌త వ్య‌క్తిని కూడా పొట్ట‌న‌బెట్టుకుంది. మృతుడిని కేర‌ళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా తోడుపుఝాలోని ముత్తంకు చెందిన థాంకచన్ ఎంచనట్టు(43)గా గుర్తించారు. థాంకచన్ న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఉద్యోగి. అక్క‌డ ప‌నిచేస్తున్న స‌మ‌యంలోనే అత‌నికి కొవిడ్‌-19 సోకింది. దాంతో ఆస్ప‌త్రిలో చేరాడు.


మొద‌ట తీవ్ర‌మైన జ్వ‌రంతో ఆస్ప‌త్రిలో చేరిన థాంకచన్‌ను ఆ త‌ర్వాత ఐసియూకి త‌ర‌లించారు. ఐసియూలో చికిత్స పొందుతూ అత‌ను చ‌నిపోయాడు. థాంకచన్‌కు భార్య‌ షీబా, పిల్లలు మాథ్యూస్, సిరిల్ ఉన్నారు. థాంకచన్ మృతితో యూఎస్‌లో క‌రోనాతో చ‌నిపోయిన కేర‌ళ వాసుల సంఖ్య 3కి చేరింది. నాలుగు రోజుల క్రితం థామ‌స్ డేవిడ్‌(43) అనే వ్య‌క్తి కూడా ఈ మ‌హ‌మ్మారితోనే క‌న్నుమూశాడు. థామ‌స్ కూడా న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఉద్యోగి.


అటు సౌదీ అరేబియాలో మ‌రో కేర‌ళ వాసి క‌రోనా ల‌క్ష‌ణాల‌తోనే మృతిచెందాడు. మలప్పురంలోని తిరురంగడికి చెందిన సఫ్వాన్(38) జ్వరంతో చికిత్స పొందుతున్న సౌదీ జర్మన్ ఆసుపత్రిలో శనివారం రాత్రి మరణించాడు. స‌ఫ్వాన్ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో మృతిచెందిన‌ట్టు అత‌ని బంధువులు తెలిపారు. అతని భార్య కమరునిజా గత నెలలోనే రియాధ్ వెళ్లింది. కాగా, శ‌నివారం రోజు కొత్త‌గా పెళ్లైన మ‌రో కేర‌ళ‌ యువ‌కుడు కూడా ఇలాగే క‌రోనా కాటుతోనే చ‌నిపోయాడు. క‌న్నూర్ జిల్లా ప‌నూర్‌కు చెందిన ష‌బ్నాస్‌(28) మ‌దీనాలోని జ‌ర్మ‌న్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు మృతిచెందాడు. మ‌రోవైపు సౌదీలో ర‌క్క‌సి క‌రోనా విరుచుకుప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 2,370 మంది బాధితులు ఉండ‌గా, 29 మంది మృత్యువాత ప‌డ్డారు.  

Updated Date - 2020-04-05T18:41:28+05:30 IST