ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2022-05-20T05:59:56+05:30 IST

మండల కేంద్రంలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందారు.

ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మృతి
మృతిచెందిన సమీర్‌, రవితేజ (ఫైల్‌)

-  గంభీరావుపేటలో విషాదం

గంభీరావుపేట, మే 19: మండల కేంద్రంలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చిన్నకర్రోల్ల రవితేజ (17), మహ్మద్‌ సమీర్‌ (18) అనే ఇంటర్‌ విద్యార్థులు గురువారం నమాజ్‌ చెరువులోకి ఈతకు వెళ్లారు. ముందుగా బట్టలు ఉతికి కట్టపై ఆరబెట్టారు. అనంతరం  ఖాళీ వాటర్‌ బాటిళ్ల సహాయంతో చెరువులోకి ఈతకు దిగారు. బాటిళ్ల సహాయం లేకుండా ఈత కొట్టే ప్రయత్నం చేశారు. చెరువు లోతు ప్రాంతంలోకి వెళ్లాక ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. వారితో వచ్చిన సమీర్‌ తమ్ముడు చాంద్‌, రేవంత్‌ అనే స్నేహితుడు వారిని కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. దీంతో  ఊళ్లోకి పరుగుతీసి, రవితేజ, సమీర్‌ గల్లంతైన విషయాన్ని బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, సమీప ప్రజలు చెరువు వద్దకు వచ్చి గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన స్థానిక ఎస్‌ఐ మహేష్‌, తరువాత సీఐ మొగిలి అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను పిలిపించి, గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. రెండు గంటలకుపైగా గాలింపు అనంతరం ముందుగా రవితేజ, అనంతరం సమీర్‌ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  మృతుల కుటుంబసభ్యులను జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ హైమద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుతారి బాలవ్వ,  బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు హమీద్‌ తదితరులు పరామర్శించి ఓదార్చారు.

- మరణంలోనూ వీడని స్నేహం..

నమాజ్‌ చెరువులో మృతి చెందిన రవితేజ, సమీర్‌లు గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ చదువుతున్నారు. కాలేజికి వచ్చినా, బయటకు వెళ్లానా ఇద్దరు వీడకుండా ఉండే వారు. చివరికి మరణంలోనూ కలిసే కానరాని లోకాలకు వెళ్లడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.  ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.  

- కుటుంబ నేపథ్యం..

చిన్నకర్రోల్ల లక్ష్మి, పర్శరాములు, దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతరు ఉన్నారు. తండ్రి పర్శరాములు గల్ఫ్‌ వెళ్లి అనారోగ్యంతో ఇటీవలే ఇంటికి వచ్చాడు. పెద్ద కొడుకు గల్ఫ్‌లో ఉన్నాడు. మృతుడు రవితేజ చిన్న కొడుకు. ఇంటర్‌మీడియట్‌ చదవుతూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంతలో ఈత రూపంలో మృత్యువు రవితేజను కబలించడంతో వారి బంధువుల్లో, స్నేహితుల్లో విషాదం నెలకొంది. సమీర్‌ది కూడద పేద కుటుంబమే. తండ్రి షకీల్‌, తల్లి గౌసీయాబేగం. వీరికి ఇద్దరు కొడుకులు. కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు సమీర్‌, చిన్న కొడుకు చాంద్‌. ఉపాధి నిమిత్తం సమీర్‌ తండ్రి షకీల్‌ గల్ఫ్‌ వెళ్లి వచ్చాడు. తిరిగి ఇటీవలే బతుకుదెరువు కోసం మహరాష్ట్ర వెళ్లాడు. పెద్ద కొడుకు సమీర్‌ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. సమీర్‌ అటు చదవుకుంటూనే చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. 


Updated Date - 2022-05-20T05:59:56+05:30 IST