యూఏఈ, ఐర్లాండ్‌లో ఇద్దరు భార‌త వ్య‌క్తులు క‌రోనాతో మృతి..!

ABN , First Publish Date - 2020-04-07T15:41:38+05:30 IST

విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా క‌రోనాకు బ‌లి అవుతున్నారు. ఇప్ప‌టికే సౌదీ, యూఎస్‌, కెనడాలో భార‌త పౌరులు చ‌నిపోయారు.

యూఏఈ, ఐర్లాండ్‌లో ఇద్దరు భార‌త వ్య‌క్తులు క‌రోనాతో మృతి..!

అజ్మాన్: మాన‌వ జాతికి సంక్షోభంగా మారిన క‌రోనా వైర‌స్‌... రోజురోజుకీ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటోంది. ప్ర‌పంచ దేశాల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న... కంటికి క‌నిపించ‌ని ఈ సూక్ష్మ‌జీవి అగ్ర‌రాజ్యల‌ను సైతం చిగురుటాకులా వ‌ణికిస్తోంది. గ‌ల్ఫ్‌లో కూడా విజృంభిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖ‌తార్, యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి చెల‌రేగిపోతోంది. దీంతో ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాలు వైర‌స్ వ్యాప్తి, నియంత్ర‌ణకు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఎన్ని నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ 'కొవిడ్‌-19' ప్రాణాలు తీస్తూనే ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా క‌రోనాకు బ‌లి అవుతున్నారు.


ఇప్ప‌టికే సౌదీ, యూఎస్‌, కెనడాలో భార‌త పౌరులు చ‌నిపోయారు. తాజాగా అజ్మాన్‌లో ఓ భార‌త వ్య‌క్తి కొవిడ్‌-19 బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కేర‌ళ రాష్ట్రం క‌న్నూరు జిల్లా కోల‌యేడులోని అలాచెర్రీకి చెందిన హ‌రీస్‌(35)గా గుర్తించారు. జ్వ‌రంతో అజ్మాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరిన హ‌రీస్‌... సోమ‌వారం క‌రోనా ల‌క్ష‌ణాల‌తో చ‌నిపోయాడు. ఈ మేర‌కు తోటి ఉద్యోగులు అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం అందించారు. హ‌రీస్ స్థానికంగా ఉండే ఓ సూప‌ర్ మార్కెట్‌లో రీజియ‌న్ మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు స‌మాచారం. హ‌రీస్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. హ‌రీస్‌ మృతితో అత‌ని స్వ‌స్థ‌లంలో విషాదం నెలకొంది.   


అలాగే ఐర్లాండ్‌లో ఓ భార‌తీయ న‌ర్సు కూడా క‌రోనాకు బ‌లి అయింది. కేర‌ళ రాష్ట్రం కొట్టాయాంకు చెందిన బీనా(55) అనే మ‌హిళ 'కొవిడ్‌-19' బారిన‌ప‌డి సోమవారం మ‌ర‌ణించింది. డ్రోఘెడాలోని అవ‌ర్ లేడీ ఆఫ్ లౌర్డేస్ ఆస్ప‌త్రిలో బీనా న‌ర్సుగా ప‌ని చేస్తోంది. రెండు రోజుల క్రితం బీనాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆస్ప‌త్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ చ‌నిపోయింది. బీనాకు ర‌ష్మీ, అన్మీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్ద‌రూ బ‌ల్గేరియాలో మెడిసిన్ చ‌దువుతున్న‌ట్లు మృతురాలి బంధువులు తెలిపారు.

Updated Date - 2020-04-07T15:41:38+05:30 IST