రాజానగరం, జనవరి 26: అరణ్య ప్రాంతాల్లో అరుదుగా దర్శనమిచ్చే రెండు తలలపాము మండలంలోని కలవచర్లలో మంగళవారం ప్రత్యక్షమైంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది చింతపండు ప్రభాకరరావుకు చెందిన పొలంలో ఈ పాము కనిపించింది. అటవీశాఖాధికారులకు సమాచారం అందించగా స్నేక్ హెల్పర్ కిషోర్ గ్రామానికి చేరుకుని పామును స్వాధీనం చేసుకున్నారు. ఇది రెడ్ సేండ్ బో అనే జాతికి చెందినదని, వాస్తవానికి ఈపాముకు ఒకే తల ఉంటుందని, కాని వెనుకవైపు భాగంగా తల భాగాన్ని పోలి ఉంటుందని, అయితే రెండు వైపుల నుంచి పాకుతుందన్నారు. ఇది విష పూరితం కాదన్నారు. కాగా రెండేళ్ల క్రితం ఇదే గ్రామంలో మరో రైతు పొలంలో రెండు తలల పాము కనిపించింది. అప్పట్లో దానిని కూడా అటవీశాఖకు అప్పగించారు.