జంట హరితాభరణాలు

ABN , First Publish Date - 2020-07-04T10:16:51+05:30 IST

ఖమ్మం జిల్లా మీదుగా రెండు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు నిర్మాణం కాబోతున్నాయి.

జంట హరితాభరణాలు

ఖమ్మం మీదుగా రెండు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు

భూసేకరణలో అధికారయంత్రాంగం

అక్కడక్కడా అడ్డుకుంటున్న రైతులు

సూర్యాపేట-దేవరపల్లి, నాగ్‌పూర్‌ టూ అమరావతి 


ఖమ్మం, జూలై 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఖమ్మం జిల్లా మీదుగా రెండు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు నిర్మాణం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై రెవెన్యూ యంత్రాంగం దృష్టిసారించింది. రాష్ట్రాల మధ్యరవాణాను వేగతరం చేయడంతోపాటు పలురకాల ఉత్పత్తులను ఏపీలోని బందరు, కాకినాడ, విశాఖ పోర్టులకు తరలించే లక్ష్యంతో ఎగుమతి, దిగుమతి రవాణాను త్వరిగతిన సాగించేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు నిర్మాణం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ సాగుతుండడంతో జిల్లాలో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతుంది. పరిహారం తేల్చకుండానే భూసేకరణపై అధికారులు కసరత్తు చేస్తుండడంతో అక్కడక్కడ రైతులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట-ఖమ్మం మధ్య నాలుగులైన్ల రహదారి భూసేకరణ ప్రక్రియ సాఫీగా సాగి పనులు ముమ్మరంగా సాగుతుండగా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. 


రవాణాను వేగవంతం చేసేందుకు..

తెలుగురాష్ట్రాల మధ్య రోడ్డు రవాణాను వేగవంతం చేయడంతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌నుంచి కూడా అమరావతికి జాతీయ రహదారులను అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో ఖమ్మంజిల్లా మీదుగా ఖమ్మం-దేవరపల్లి, మంచిర్యాల- అమరావతి రెండు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి సర్వే ప్రక్రియ ప్రారంభమవగా కొన్ని చోట్ల రైతులు తమ భూములకు తగిన ధర ఇవ్వాలంటూ అడ్డుకుంటున్నారు. అయితే సూర్యాపేటనుంచి ఖమ్మం వరకు నాలుగులైన్ల రహదారులపనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈజాతీయ రహదారులు పూర్తయితే సరుకు రవాణాతోపాటు ఏపీలోని కాకినాడ, బందరు పోర్టులకు వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానైట్‌ లాంటి ఖనిజ సంపద ఇతర సరుకు రవాణా ఈ రహదారిలో నుంచి వేగవంతం చేసేందుకు ఈప్రక్రియ సాగుతోంది.


ప్రస్తుతం ఉన్న రహదారులు కాకుండా కొత్త రహదారులు నిర్మాణం కోసం భూసేకరణ సాగుతోంది. రెండేళ్లుగా ప్రతిపాదనలో ఉన్న ఈగ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల పనులు వేగవంతమవుతుండగా గతంలో రోడ్లు భవనాలశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంనుంచి తుమ్మల నాగేశ్వరరావు ఈరహదారుల మంజూరులో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో పలుజాతీయరాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులగా మార్చడంతోపాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర జాతీయ రహదారులు అబివృద్ధి చేసి కోస్తాలోని పోర్టులకు అనుసంధానం చేయాలని అప్పటి కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో చర్చించి వీటిని మంజూరుచేయించారు. 


వేగంగా సూర్యాపేట-ఖమ్మం పనులు..

సూర్యాపేటనుంచి ఖమ్మం వరకు రెండేళ్ల క్రితం మంజూరైన నాలుగులైన్ల రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. సూర్యాపేటనుంచి ఆంద్రాలోని దేవరపల్లి వరకు నిర్మించే ఈనాలుగులైన్ల రహదారిలో ఖమ్మం-సూర్యాపేట వరకు నాలుగులైన్ల కింద రూ.1300కోట్లతో చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం ఖమ్మంజిల్లాలోని నాయకన్‌గూడెంనుంచి తల్లంపాడు వరకు 280 ఎకరాల భూమిని సేకరించి రైతులకు రూ.41కోట్లు పరిహారంగా చెల్లించారు. ఈప్రక్రియ ఏడాదిన్నర క్రితమే జరిగింది. అప్పుడు రోడ్లు భవనాలశాఖమంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉండడం, పాలేరు ఎమ్మెల్యే కూడా ఆయన కావడంతో రైతులు, అధికారులతో చర్చించి భూసేకరణ వేగవంతం చేయడం ద్వారా పనులు ప్రారంభమై సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు ఫార్మేషన్‌, మెటల్‌ పనులు నడుస్తున్నాయి. 


తల్లంపాడు-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌..

ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు నుంచి ఏపీలోని సరిహద్దు దేవరపల్లి వరకు 109కి.మీవరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం కాబోతోంది. ఇందుకు సుమారు రూ.2800కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఖమ్మంరూరల్‌, రఘునాధపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల మీదుగా ఏపీలోని దేవరపల్లి వరకు నిర్మించనురన్నారు. ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరికి వెళ్లే వారికి సుమారు 40కిమీ.దూరం తగ్గనుంది. విజయవాడ మీదుగా వెళ్లే ఉభయగోదావరి జిల్లా వాసులతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు ఈ రహదారి నిర్మాణం ద్వారా సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా, ఖమ్మం సత్తుపల్లి మీదుగా, ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు జరగనున్నాయి.


ఈ రహదారి నిర్మాణం ద్వారా కాకినాడ, విశాఖ, బందరు పోర్టులకు సరుకు రవాణాతోపాటు వ్యవసాయ, ఖనిజ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతికి ఈరహదారులు వినియోగించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులకు ఎక్కడా స్టాంపులు ఉండకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉన్నందున సమయంకూడా ఆదా అవుతుందని అదికారులు చెబుతున్నారు. దీంతో ఖమ్మంజిల్లాలో భూసేకరణను అధికారులు వేగవంతం చేశారు. 


మంచిర్యాల - అమరావతి రహదారి

ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోడ్డు రవాణా మెరుగుపడేలా ఏపీలోని పోర్టులకు సరుకు ఎగుమతులు, దిగుమతులు పెంచేలా నాగ్‌పూర్‌-మంచిర్యాల, ఖమ్మం, అమరావతికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రాబోతుంది. దీనికోసం కూడా భూసేకరణ సర్వే సాగుతుంది. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, అప్పటి తెలంగాణ రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరహదారిని రెండేళ్ల క్రితం ప్రతిపాదించారు. ఈనాలుగు లైన్ల రహదారి నిర్మాణం జరిగితే కూడా అమరావతి రాజధానికిచ మహారాష్ట్రకు రోడ్డు రవాణా మెరుగవనుంది. పలురకాల ఉత్పత్తులు బందరు, కాకినాడ పోర్టులకు తరలించడం, ఎగుమతులు, దిగుమతులు సులువుగా జరిగేలా ఈ రహదారిని ప్రతిపాదించారు. అయితే ఇది ప్రాథమిక దశలోనే ఉంది. భూసేకరణసర్వేపై అధికారులు దృష్టిసారించారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి కావడంతో రైతుల భూములుపోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


సర్వేను అడ్డుకుంటున్న రైతులు..

ఖమ్మంజిల్లా మీదుగా వెళుతున్న రెండు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులతో విలువైన భూములను కోల్పోయే పరిస్థితి వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట-ఖమ్మంవరకు నాలుగులైన్ల రహధారి పనులకు రైతులనుంచి భూసేకరణ సాఫీగా సాగినా ఖమ్మంనుంచి దేవరపల్లి భూసేకరణలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. కల్లూరు, పెనుబల్లి, ఖమ్మంరూరల్‌ మండలాల్లో తమ పొలాలకు మార్కెట్‌లో రూ.25నుంచి50లక్షలు పైగా ఉందని, ప్రభుత్వం ఇచ్చే రూ.8, రూ.10లక్షల ధర గిట్టుబాటు కాదంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల సర్వే నిలిచిపోగా కొన్నిచోట్ల మాత్రం పోలీసుల సహకారంతో సర్వే జరుగుతోంది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు కూడా రైతులతో చర్చలుసాగిస్తున్నారు. 


పనులు వేగంగా చేస్తున్నాం..దుర్గాప్రసాద్‌, నేషనల్‌ హైవే ఖమ్మం ప్రాజెక్టు డైరెక్టర్‌ 

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి భూసేకరణ వేగంగా జరిగితే పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట-ఖమ్మం రహదారి పనులు వేగంగా చేస్తున్నాం. నాగ్‌పూర్‌-అమరావతి వయా మంచిర్యాల, వరంగల్‌ ఫోర్‌ లైన్‌ రహదారి పనులకు ఇంకా సర్వే పూర్తికావాలని, ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, దీనికి కూడా భూసేకరణ చేసేందుకు సర్వే పనులు నిర్వహిస్తున్నాం. 


బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు..రాజశేఖరరెడ్డి, కోండ్రుపాడు, పెనుబల్లి మండలం

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. మా భూముల ధరలు అధికంగా ఉంటే తక్కువ ధరకే భూమి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా తరుణంలో భూసేకరణ చేయకూడదు. కానీ పోలీసుల పహరా పెట్టుకుని సర్వే పనులు చేస్తున్నారు. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తాం. 

Updated Date - 2020-07-04T10:16:51+05:30 IST