అయ్యో.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ ఇద్దరు యువతులకు ఏం కష్టం వచ్చిందో..!?

ABN , First Publish Date - 2022-02-02T13:36:06+05:30 IST

ఒక్క క్షణం ఆలోచించి వారి భవిష్యత్తు... వారి తల్లిదండ్రుల ఆశలు దృష్టిలో ఉంచుకుని ఉంటే

అయ్యో.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ ఇద్దరు యువతులకు ఏం కష్టం వచ్చిందో..!?

  • ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యపై పోలీసుల విచారణ


కడప : ఒక్క క్షణం ఆలోచించి వారి భవిష్యత్తు.. వారి తల్లిదండ్రుల ఆశలు దృష్టిలో ఉంచుకుని ఉంటే వారి భవిష్యత్తు మరోలా ఉండేది. వారిరువురికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కాని రైలు కింద పడి ఇరువురు సోమవారం బలవన్మరణం చెందారు. కనీసం వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న విషయాన్ని అటు పోలీసులు కానీ ఇటు వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. కళ్యాణి అనే యువతి జగనన్న విద్యాకానుకకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్నట్లు ఇంటిలో చెప్పి వచ్చిందంటూ వారి కుటుంబ సభ్యులు రిమ్స్‌ మార్చురీ వద్ద రోదిస్తూ చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకుని చదివిస్తున్న తమ బిడ్డ ఇలా తనువు చాలించిందంటూ గుండెలవిసేలా రోదించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి చెందిన పూజిత (19) తాడిపత్రిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా తాడిపత్రికి చెందిన కళ్యాణి గుత్తిలో ఇంజనీరింగ్‌ చదువుతోంది. వీరు స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు.


ఒకరు కాలేజికి వెళుతున్నానని రాగా.. మరొకరు జగనన్న విద్యాదీవెనకు దరఖాస్తు చేసుకునేందుకంటూ ఇరువురు తాడిపత్రిలో కలుసుకున్నట్లు కడప రైల్వే ఎస్‌ఐ రారాజు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి నుచి  కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కి ఇరువురు కడపకు వచ్చారన్నారు. కడప రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు ఫ్లాట్‌ఫారంపై తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో గుర్తించినట్లు తెలిపారు. రైల్వే ఫ్లాట్‌ఫాం పైకి వచ్చి ఇరువురు సెల్ఫీలు తీసుకొని అక్కడి నుంచి భాకరాపేట విశ్వనాధపురానికి వెళ్లి అక్కడ గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై అటు వారి స్నేహితులను, కుటుంబ సభ్యులను, కళాశాల అధ్యాపకులను అడిగినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం లేదని తెలిపారు. వారి మృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించారు. కాగా అనంతపురం యాడికి నుంచి విద్యార్థిని బంధువులు కడప మార్చురీ వద్దకు వచ్చి వారి మృతదేహాలను చూసి భోరున విలపించారు.


నా కళ్ల ముందే చనిపోయారు 

ఇద్దరు విద్యార్థినులు రైలు కింద పడేందుకు వచ్చారని రైలు పట్టాలపై ఉన్న వారిని చూసి రైలు కాస్త స్లో చేసి హారన్‌ ఇచ్చానని అప్పటికే వారు ట్రాక్‌ నుంచి పక్కకు వెళ్లారన్నారు. దీంతో తాను రైలు వేగాన్ని కాస్తా పెంచానని సడన్‌గా ఇరువురు నా కళ్ల ముందే రైలు కింద పడ్డారని, తాను కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ రోజంతా నాకు వారి ఆత్మహత్య బాధ కలిగించిందనట్లు రైల్వే పోలీసులకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. 

- అబ్దుల్‌ రౌఫ్‌, గూడ్స్‌ రైలు లోకో పైలెట్‌. 

Updated Date - 2022-02-02T13:36:06+05:30 IST